తర్వాత ఎన్నార్సీయే : జేపీ నడ్డా

19 Dec, 2019 17:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీయేతర పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం మండిపడ్డారు. మూడు దేశాల నుంచి భారతదేశానికి వలస వచ్చిన మైనార్టీ శరణార్థులను కలిస్తే వారి బాధలేంటో తెలుస్తాయని చురకంటించారు. గురువారం ఆయన ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి వలసొచ్చిన సిక్కు శరణార్థులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసి తీరుతాం. 28, 30 ఏళ్ల క్రితం భారతదేశానికి వచ్చిన మైనార్టీలు దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వారికి భారత పౌరసత్వం లేనందున ఇల్లు కట్టుకోలేరు. పాఠశాలల్లో వారి పిల్లలను చేర్చలేరు. ఇలాంటివేవీ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలకు పట్టవు. వారికి కావాల్సిందల్లా రాజకీయమే’ అంటూ ధ్వజమెత్తారు. పౌరసత్వ చట్టం తర్వాత సమీప భవిష్యత్తులో ఎన్నార్సీ కూడా ఉంటుందని నడ్డా స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సంస్కరణలతో దేశం అభివృద్ధి పయనంలో సాగుతోందని వెల్లడించారు. చదవండిపౌరసత్వ చట్టం తేవాలి : అప్పట్లో రాజ్యసభలో మన్మోహన్‌

మరిన్ని వార్తలు