నరేంద్ర మోదీకో ఐదు రూపాయలు

2 May, 2016 14:21 IST|Sakshi
నరేంద్ర మోదీకో ఐదు రూపాయలు

రాంచి: జార్ఖండ్‌లోని లతేహార్ ప్రాంతంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న 300 గ్రామీణ కుటుంబాలు అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మే ఒకటవ తేదీన వినూత్న నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈసారి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మున్నెన్నడూ లేని విధంగా బడ్జెట్‌లో భారీ కేటాయింపులు జరిపామని చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ పథకం కింద రోజుకు చెల్లించే దినసరి వేతనాన్ని కేవలం ఐదు రూపాయలు పెంచడాన్ని వారు తీవ్రంగా నిరసిస్తున్నారు.

‘మీ వద్ద నిధులు లేక కేవలం ఐదు రూపాయలను పెంచినట్టున్నారు. ఇదిగో మేము తలా ఓ ఐదు రూపాయలను మీకు విరాళంగా అందజేస్తున్నాము. ఇవి తీసుకోని ఉపాధి హామీ పథనం నిధులు పెంచుకోండి’ అని కార్మిక కుటుంబాలు వ్యంగ్యంగా విమర్శిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖకు ఐదు రూపాయల నోటును జతచేసి పంపించాయి. ఈ వినూత్న నిరసన కార్యక్రమాన్ని ఏ నెలంతా కొనసాగిస్తామని కార్మిక కుటుంబాలు తెలిపాయి.

ఉపాధి హామీ పథకం కింద గతేడాది వరకు ఇచ్చిన దినసరి వేతనాన్ని 162 రూపాయల నుంచి 167 రూపాయలకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. జార్ఖండ్‌తోపాటు బీహార్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో దినసరి వేతనాన్ని 162, 159 రూపాయల నుంచి 167కు పెంచుతూ గత మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జార్ఖండ్‌లో కనీస కార్మిక వేతనం 212 రూపాయలు ఉండగా, దానికన్నా 45 రూపాయలు తక్కువగా ఉపాధి హామీ పథకం కింద చెల్లిండం ఏమిటని కార్మికలోకం ప్రశ్నిస్తోంది. కరవు పరిస్థితులు తీవ్రంగా ఉన్న సమయంలో ఈ సొమ్ము ఏ మూలకు సరిపోతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో 11 లక్షల మంది కార్మికులు ఉపాధి హామీ పథకం కింద రోడ్డు, చెరువులు, బావుల నిర్మాణపు పనుల్లో పాల్గొంటున్నారు. వారికి ఏడాదికి వంద రోజుల పని దినాల్ని కల్పిస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న వారిలో 43 శాతం మంది మహిళలు ఉండగా, 37 శాతం మంది గిరిజనులే ఉన్నారు.

2014లో ఈ పథకం కింద 20 రూపాయలు పెంచగా, గతేడాది 4 రూపాయలు, ఈ ఏడాది ఐదు రూపాయలు పెంచారని, ఈ పెంపులో ఎలాంటి తర్కం లేదని నరేగ సహాయత కేంద్రానికి చెందిన కార్యకర్త జేమ్స్ హెరెంజ్ వ్యాఖ్యానించారు. ఒడిశా రాష్ట్రంలోనైతే ఈ సారి ఒక్క పైసా కూడా పెంచలేదని, వారికి ఇప్పటికే ఇస్తున్న డబ్బులు ఎక్కువని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉందని జేమ్స్ విమర్శించారు. తమ నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఇతర జిల్లాల నుంచి ఐదు రూపాయలు జత చేసిన లేఖలను మోదికి పంపిస్తామని కార్మికులు తెలిపారు.

మరిన్ని వార్తలు