ఓటుకు ఎన్నారైలు నో

28 Jul, 2018 02:44 IST|Sakshi

ఓటర్లుగా నమోదు చేయించుకున్న వారు 0.1శాతం మాత్రమే

న్యూఢిల్లీ: స్వదేశంలో ఓటరుగా పేరు నమోదు చేయించుకునేందుకు ఎన్నారైలు అంతగా ఆసక్తి చూపడం లేదు. 2010లో కేంద్రం చేసిన చట్ట సవరణ తర్వాత  3.12 కోట్ల మంది ప్రవాస భారతీయుల్లో ఓటరుగా నమోదు చేయించుకున్న వారు 24,507 మందే. ఇది మొత్తం ఎన్నారైలలో 0.1 శాతమే. అయితే, విదేశాల్లోని కేరళీయుల్లో 96శాతం మంది ఓటు హక్కు కోసం పేరు నమోదు చేసుకోవడం విశేషం.

ఆన్‌లైన్‌లో పేరు నమోదు
స్వదేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పించాలన్న ఎన్నారైల విజ్ఞప్తులకు స్పందించిన కేంద్రం 2010లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి పలు సవరణలు చేసింది. దీంతో ఎన్నారైలు ఇక్కడ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ఇలాంటి అర్హతలున్న ఎన్నారైలు తాము పుట్టిన ప్రాంతంలో ఓటు హక్కు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జాతీయ ఓటర్ల సేవా పోర్టల్‌(ఎన్‌వీఎస్‌పీ) ద్వారా ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రస్తుతం తాము ఉంటున్న దేశం వీసా, పాస్‌పోర్టు వివరాలివ్వాలి.

కేరళీయులు అత్యధికం
2012లో ఎన్నారై ఓటర్ల సంఖ్య 10,002 కాగా 2018 నాటికి 24,507కు చేరుకుంది. వీరిలో మహిళలు 1,942 మంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న భారతీయుల సంఖ్య 3.12 కోట్లు. 2012 లెక్కల ప్రకారం మొత్తం 10,002 మంది ఎన్నారైలు పేర్లు రిజిస్టర్‌ చేయించుకోగా అందులో 9,838 మంది కేరళీయులే. మొత్తం ఎన్నారై ఓటర్లలో కేరళీయుల శాతం 96గా ఉంది. వందమంది కంటే ఎక్కువగా పేర్లు నమోదు చేయించుకున్న రాష్ట్రాల్లో కేరళ తర్వాత పంజాబ్, పుదుచ్చేరి ఉన్నాయి. ఎన్నారై ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ప్రస్తుత విధానాలు అనుకూలంగా లేవు. ఎన్నారైల్లో ఓటుహక్కు వినియోగం పెరిగేందుకు ప్రాక్సీ విధానం అనుసరించడమే మేలని ఈసీ కమిటీ తేల్చింది.

మరిన్ని వార్తలు