చిన్నమ్మ ఆశలు అడియాశలు

22 Oct, 2019 08:23 IST|Sakshi

ముందస్తు విడుదలకు చుక్కెదురు

సత్ప్రవర్తన పరిధిలో ఆమె లేరు

కర్ణాటక జైళ్లశాఖ డైరక్టర్‌ ఎన్‌ఎస్‌ మెక్రిక్‌ స్పష్టీకరణ

సాక్షి ప్రతినిది, చెన్నై: నాలుగేళ్ల శిక్షాకాలం ముగిసేలోపే విడుదలవ్వాలని శశికళ పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. సత్ప్రవర్తన పరిధిలో ఆమె లేనందున ముందస్తు విడుదల సాధ్యం కాదని, శిక్షాకాలాన్ని పూర్తిగా అనుభవించాల్సి ఉంటుందని కర్ణాటక జైళ్లశాఖ డైరక్టర్‌ ఎన్‌ఎస్‌ మెక్రిక్‌ సోమవారం స్పష్టం చేశారు.అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో  2017 ఫిబ్రవరి నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో నాలుగేళ్ల శిక్షను అనుభవిస్తున్నారు.

ఇదే కేసులో ఆమె సమీప బంధువులు ఇళవరసి, సుధాకర్‌ కూడా అదే జైల్లో నాలుగేళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్నారు. వీరి శిక్షాకాలం ప్రారంభం కాగా ప్రస్తుతానికి రెండున్నరేళ్లు పూర్తయిన దశలో సత్ప్రవర్తన కింద ముందుగానే జైలు నుంచి విడుదల అవుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. శశికళ, ఆమె అక్క కుమారుడు టీటీవీ దినకరన్‌ సైతం విడుదల కోసం ఎదురుచూశారు.ఈ స్థితిలో కర్ణాటక జైళ్లశాఖ డైరక్టర్‌ ఎన్‌ఎస్‌ మెక్రిక్‌ వారి గుండెల్లో బాంబులాంటి వార్తను పేల్చారు. శశికళ తన శిక్షాకాలాన్ని పూర్తి చేసిన తరువాతనే విడుదల అవుతారని, జైలులో సత్ప్రవర్తన కింద ఆమెను పరిగణించలేమని తేల్చేశారు. ఈ సమాచారంతో అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం శ్రేణులు దిగాలులో పడిపోయారు. పూర్తిస్థాయి శిక్షాకాలం అంటే 2021 ఫిబ్రవరి వరకు శశికళ విడుదల కోసం వేచి ఉండక తప్పదని వాపోతున్నారు.

మరిన్ని వార్తలు