రంగంలోకి దోవల్‌ : తోక ముడిచిన చైనా

6 Jul, 2020 15:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌-చైనా సరిహద్దుల్లోని గల్వాన్‌ లోయలో నెలల తరబడి కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడినట్లు కనిపిస్తోంది. సరిహద్దు వివాదం నేపథ్యంలో గతకొంత కాలంగా చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు ఇరు దేశాలు ముగింపు పలికినట్లుగా తెలుస్తోంది. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద గల్వాన్‌ లోయలో ఘర్షణలు జరిగాక ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్‌ వెళ్లి సైన్యంతో మాట్లాడటం, అనంతరం జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ దోవల్‌ రంగంలోకి దిగడంతో చైనా సైన్యం తోకముడిచి వెనక్కి తగ్గింది. భారత చర్చల ఫలితంగా ఎట్టకేలకు ఫింగర్‌ 4 పాయింట్‌ నుంచి చైనా సైన్యం సుమారు కిలోమీటరున్నర దూరం వరకు వెనక్కి వెళ్లింది. మోదీ పర్యటన అనంతరం అజిత్‌ దోవల్‌ చైనా విదేశాంగ మంత్రితో ఆదివారం సుమారు రెండుగంటల పాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. దేశ భద్రతా వ్యవహారాల్లో ఆరితేరిన అజిత్‌.. తన చాణిక్యతను ఉపయోగించి చైనాతో సమస్య పరిష్కారానికి దారిచూపారు.  (గల్వాన్‌పై ఎందుకు చైనా కన్ను?)

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దుల్లో శాంతి యుత పరిస్థితులు నెలకొల్పాలని ఇరు దేశాల ప్రతినిధులు ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న ఇరుదేశాల సైనిక బలగాలను వీలైనంత తొందరగా ఉపసంహరించుకోవాలని అంగీకరించారు. వాస్తవాధీన రేఖను రెండు దేశాలు పరస్పరం గౌరవించుకోవాలని, ఏకపక్షంగా ఎల్‌ఏసీని మార్చే ప్రయత్నాలను మానుకోవాలి నిర్ణయించారు. అలాగే ఇరు దేశాల మధ్య శాంతియుత సంబంధాల కోసం చర్చలు నిరంతరం కొనసాగాలని ఒప్పందం కుదుర్చున్నారు. (గల్వాన్‌ లోయలో కీలక పరిణామం)

తూర్పు లద్దాఖ్‌ ప్రాంతాంలోని గల్వాయ్‌ లోయలో గల వివాదాస్పద ప్రాంతంలో చైనా సైన్యం గుడారాలు ఏర్పాటు చేయడం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూన్‌ 15న చెలరేగిన హింసాత్మక ఘటనలో 20 మంది భారత సైనికులు మృతిచెందారు. దీంతో చైనాపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని యావత్‌దేశం ముక్తకంఠంతో నినదించింది. అయితే చైనా ఆర్థిక మూలాలపై దెబ్బతీయాలని భావించిన భారత ప్రభుత్వం డిజిటల్‌ స్ట్రైక్స్‌ ద్వారా డ్రాగాన్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ క్రమంలోనే గతవారం మోదీ అనూహ్యంగా లద్దాఖ్‌లో పర్యటించి చైనాకు గట్టి హెచ్చరికలు ఇచ్చారు. విస్తరణవాదానికి ఇక కాలం చెల్లిపోయిందని భారత భూభాగాలను ఆక్రమిస్తే ఊరుకునే ప్రసక్తేలేదని మోదీ తేల్చి చెప్పారు.

ఈ పరిణామం చైనా కమ్యూనిస్ట్‌ ప్రభుత్వానికి గట్టి షాక్‌ లాంటిదే. ఇక మోదీ లద్దాక్‌ పర్యటన అనంతరం అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్మీ చీఫ్‌లతో ప్రత్యేకంగా భేటీ అయిన అజిత్‌ దోవల్ ఆదివారం సాయంత్రం సుమారు రెండుగంటల పాటు చైనా విదేశాంగమంత్రితో చర్చలు జరిపారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని, వివాదాస్పద భూభాగం నుంచి వెనక్కి తగ్గలని కోరారు. ఈ నేపథ్యంలో చర్చల అనంతరం సోమవారం ఉదయం చైనా సైనం వెనక్కి తగ్గింది.

కేంద్రంలో కీలక పాత్ర..
మోదీ దేశ ప్రధాని అయ్యాక  అజిత్‌ దోవల్‌ని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)గా నియమించారు. వివిధ ఆపరేషన్లలో క్షేత్రస్థాయి అనుభవం ఉన్న దోవల్‌కి సమర్థవంతమై అధికారిగా మంచి గుర్తింపు ఉంది. ఎన్‌ఎస్‌ఏగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే ఇరాక్‌లో ఐసిస్‌ దాడుల్లో చిక్కుకున్న 45 మంది భారతీయ నర్సుల్ని క్షేమంగా స్వదేశానికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. 2015 జనవరిలో జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తీసుకొచ్చి అన్నింటా చైనాకు వత్తాసు పలుకుతున్న అప్పటి అధ్యక్షుడు మహింద రాజపక్సను గద్దె దించడంలోనూ దోవల్‌ వ్యూహ రచన చేశారని పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపించాయి. గతంలో మణిపూర్‌లో మన సైన్యానికి చెందిన వాహనశ్రేణిపైన దాడిచేసి 18 మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న తీవ్రవాదులపైన ప్రతీకారంగా మన సైన్యం మయన్మార్‌లోకి వెళ్లి మెరుపుదాడి చేసి 40 మంది తీవ్రవాదుల్ని హతమార్చింది. దీని వెనుకా అజిత్‌ హస్తం ఉంది. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ విషాయాల్లో మోదీ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేస్తూ అజిత్‌ దోవల్‌ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా చైనా వివాదాన్ని పరిష్కరించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు.

మరిన్ని వార్తలు