మిలిటెంట్ల డెన్‌లో అజిత్‌ దోవల్‌ పర్యటన

10 Aug, 2019 18:06 IST|Sakshi
అనంత్‌నాగ్‌లో అజిత్‌ దోవల్‌

అనంత్‌నాగ్‌ (జమ్మూకశ్మీర్‌): జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ శనివారం అనంత్‌నాగ్‌లో పర్యటించారు. అక్కడి స్థానికులతో ముచ్చటించారు. ఉగ్రవాదులకు అడ్డగా పేరొంది.. జమ్మూకశ్మీర్‌లో మిలిటెన్సీకి కేంద్రంగా ఉన్న అనంత్‌నాగ్‌లో అజిత్‌ దోవల్‌ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అనంత్‌నాగ్‌లో ఇటీవల పెద్దసంఖ్యలో ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో పలువురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు.

ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ విభజన నేపథ్యంలో స్థానికంగా పర్యటిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న అజిత్‌ దోవల్‌ స్థానికులతో మమేకమవుతూ.. వారి బాగోగులు తెలుసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అనంత్‌నాగ్‌లో పర్యటించిన దోవల్‌.. వీధుల్లో తిరుగుతూ తనకు ఎదురుపడిన స్థానికులతో మాట్లాడారు. పిల్లలతో సరదాగా ముచ్చటించారు. మౌల్వీలు, కార్మికులు, పాదచారులు.. ఇలా అనేక మందితో మాటామంతి కలిపారు. బక్రీద్‌ పండుగ నేపథ్యంలో అనంత్‌నాగ్‌లోని ఓ మేకల మండీలో గొర్రెల వ్యాపారులతో దోవల్‌ మాట కలిపారు. వ్యాపారం ఎలా జరుగుతుందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ గొర్రెల వ్యాపారి దోవల్‌తో మాట్లాడుతుండగా.. అతన్ని మరొకరు ఎవరితో మాట్లాడుతున్నావని ప్రశ్నించారు. దీనికి అతను తెలియదని బదులిచ్చాడు. అదేం పెద్ద సమస్య కాదని దోవల్‌ బదులిచ్చారు. మరో వీడియోలో నెట్‌వర్క్‌ కనెక్టివిటీ లేకపోవడంతో తమ బంధువులతో, ఇతరులతో మాట్లాడటం కష్టంగా ఉందని దోవల్‌కు పలువురు స్థానికులు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు