బీజేపీపై అమెరిక నిఘా!!

1 Jul, 2014 14:46 IST|Sakshi
బీజేపీపై అమెరికా నిఘా!!

భారతీయ జనతా పార్టీ సహా.. ప్రపంచంలోని కొన్ని రాజకీయ పార్టీలపై నిఘా పెట్టే అధికారాన్ని అమెరికా నిఘా సంస్థ ఎన్ఎస్ఏకు 2010లో అక్కడి కోర్టు మంజూరు చేసింది. ఈజిప్టులోని ముస్లిం బ్రదర్హుడ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ విషయం ఇన్నేళ్ల తర్వాత బయటపడింది. లెబనాన్కు చెందిన అమల్, వెనిజువెలా లోని బొలివారియన్ కాంటినెంటల్ కోఆర్డినేటర్, ఈజిప్టులోని నేషనల్ సాల్వేషన్ ఫ్రంట్ సైతం ఈ జాబితాలో ఉన్నాయి. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడించింది.

193 విదేశీ ప్రభుత్వాలతో పాటు పలు విదేశీ గ్రూపులు, వాటి అనుబంధ సంస్థలు.. అన్నింటి పేర్లూ ఈ పత్రంలో ఉన్నాయి. ఈ జాబితాను ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వయలెన్స్ కోర్టు ఆమోదించింది. ఈ జాబితాలో భారతదేశం పేరు కూడా ఉంది. ఈ దేశాలు, అక్కడి రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలపై నిఘా ఉంచేందుకు ఎన్ఎస్ఏకు అధికారం ఇస్తూ సదరు కోర్టు ఉత్తర్వులిచ్చింది. ప్రతి సంవత్సరం ఎన్ఎస్ఏ ఈ కోర్టు నుంచి ప్రత్యేకంగా అనుమతులు తీసుకున్న తర్వాతే నిఘా పెట్టాల్సి ఉంటుంది. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, యూరోపియన్ యూనియన్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ లాంటి సంస్థలపై కూడా అమెరికా నిఘా నడిచింది.

మరిన్ని వార్తలు