యాక్టివ్‌గా 300 మొబైల్ కనెక్షన్లు... వారు హతమయ్యారు!!

4 Mar, 2019 20:40 IST|Sakshi

న్యూఢిల్లీ : కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ ప్రధాన స్థావరం బాలకోట్‌లో భారత వైమానిక దళం బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌లోని ఖైబర్‌ పంక్తువా ప్రావిన్స్‌లోని జైషే క్యాంపులపై సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థంతో ఐఏఎఫ్‌ విరుచుకుపడింది. ఈ మెరుపు దాడుల్లో పన్నెండు మిరాజ్‌- 2000 యుద్ధ విమానాలు పాల్గొనగా... సుమారు 250 మంది 300 మంది ఉగ్రవాదులు మృతి చెందారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్షాలు మాత్రం ఇదంతా ప్రభుత్వం హడావుడి మాత్రమేనని విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ(ఎన్‌టీఆర్‌ఓ) వర్గాలు కీలక సమాచారం వెల్లడించాయి. మెరుపు దాడులు జరిగిన సమయంలో టార్గెట్‌ వద్ద 300 మొబైల్స్‌ యాక్టివ్‌గా ఉన్నాయని పేర్కొన్నాయి. జైషే క్యాంపులపై భారత జెట్‌ ఫైటర్లు దాడి చేస్తున్నాయనే సమాచారంతో బాలకోట్‌ వద్ద ఉన్న ఫోన్‌ కార్యకలాపాలపై దృష్టి సారించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దాడికి ముందు ఆ ప్రాంతంలో సిగ్నల్స్‌ ట్రేస్‌ చేసినట్లు పేర్కొన్నాయి. దీంతో సర్జికల్‌ స్ట్రైక్స్‌లో 300 మంది ఉగ్రవాదులు చచ్చిపోయారనే వార్తలకు బలం చేకూరినట్లైంది. కాగా పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన ఉగ్రదాడుల్లో ఎంత మంది హతమయ్యారనే విషయం గురించి ప్రభుత్వం ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు.

మరిన్ని వార్తలు