11 కోట్ల మంది పొగరాయుళ్లు.. తెగ ఊదేస్తున్నారు!

27 Feb, 2016 11:46 IST|Sakshi
11 కోట్ల మంది పొగరాయుళ్లు.. తెగ ఊదేస్తున్నారు!

భారత దేశంలో పొగరాయుళ్లు విపరీతంగా పెరిగిపోతున్నారట. 1998 నుంచి 2015 మధ్య వీళ్ల సంఖ్య 33 శాతం వరకు పెరిగిందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో దాదాపు 11 కోట్ల మంది ఉఫ్‌మంటూ సిగరెట్లు ఊదేస్తున్నారట. అయితే మహిళల్లో మాత్రం పొగరాణుల సంఖ్య మరీ అంత ఎక్కువ పెరగలేదట. 15-69 ఏళ్ల మధ్యవారిలో పొగరాయుళ్ల సంఖ్య దాదాపు 3 కోట్లు పెరిగింది. 1998 నాటికి సుమారు 8 కోట్ల మంది ఉండగా, 2015 నాటికి వారి సంఖ్య 11 కోట్లు అయ్యింది. మొత్తమ్మీద అప్పటికంటే ఇప్పటికి జనాభా పెరగడం వల్ల కూడా పొగతాగేవారి సంఖ్య పెరిగిందని అంటున్నారు. 2010 సంవత్సరంలో సిగరెట్లు కాల్చడం వల్ల సంభవించే మరణాలు దాదాపు పది శాతం పెరిగాయి.

వారిలో ఎక్కువ మంది... అంటే దాదాపు 70  శాతం మంది 30-69 సంవత్సరాల మధ్య వయసులో చనిపోతున్నారు. నిజానికి జీవితంలో ఉత్పాదకత ఎక్కువగా ఉండే వయసు ఇదేనని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటో ప్రొఫెసర్ ప్రభాత్ ఝా తెలిపారు. ప్రపంచం మొత్తమ్మీద భారత దేశం కంటే ఎక్కువ మంది పొగరాయుళ్లు ఉన్న ఏకైక దేశం చైనా మాత్రమేనట. అలాగే, బీడీల స్థానాన్ని కూడా సిగరెట్లు క్రమంగా ఆక్రమిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా జీవన ప్రమాణాలు, ఆదాయ అవకాశాలు పెరగడం వల్ల ఇలా జరుగుతోందని అంటున్నారు.

మరిన్ని వార్తలు