మంత్రి కాన్వాయ్‌కు ఎదురెళ్లి మరి

23 Jul, 2018 15:38 IST|Sakshi
మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న క్రైస్తవ సన్యాసిని రిన్సీ

తిరువనంతపురం: నాయకులు, ప్రభుత్వ అధికారులు ఉన్నది ప్రజలకు సేవా చేయడం కోసమే. కానీ అప్పుడప్పుడు వారు ఈ విషయాన్ని మర్చిపోతుంటారు. ప్రజలే వారికి గుర్తు చేయాల్సి ఉంటుంది. అయినా వింటారని నమ్మకం లేదు. కేరళకు చెందిన ఓ మహిళకు ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. అధికారుల తీరుతో విసిగి వేసారిన ఓ నన్‌(క్రైస్తవ సన్యాసని) ఏకంగా రోడ్డు మీదే మంత్రి కాన్వాయ్‌ను ఆపి మరి తన సమస్యను పరిష్కరించమని డిమాండ్‌ చేసారు.

వివరాల ప్రకారం రిన్సీ అనే నన్‌ పాలక్కడ్‌లోని, అట్టపాడి అనే గ్రామంలో ఉన్న  ఓ కాన్వెంట్‌లో పనిచేస్తున్నారు. కొన్ని రోజులుగా ఏనుగులు తన కాన్వెంట్‌లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ విషయం గురించి స్థానిక అటవీ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేదు. ఈ సమయంలో కేరళలోని పాలక్కడ్‌ జిల్లాలో జరిగే ఓ కార్యక్రమానికి రాష్ట్ర అటవీశాఖ మంత్రి కె.రాజు హాజరవుతున్నారని తెలిసింది. దాంతో ఈ విషయం గురించి సరాసరి మంత్రికే ఫిర్యాదు చేయాలని భావించింది.

అందుకే మంత్రి వెళ్లే మార్గంలో ఎదురుచూస్తూ ఉండి, కాన్వాయ్‌ రాగానే వెళ్లి దానికి అడ్డుగా నిల్చుంది. తన సమస్యను తెలియజేసి, పరిష్కారం చెప్పేవరకూ మంత్రిని అక్కడనుంచి కదలనిచ్చేది లేదని భీష్మించుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో రిన్సీ తన కాన్వెంట్‌ క్యాంపస్‌లోకి ఏనుగులు చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయని, దీని వల్ల పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పరిష్కారం చూపించాల్సిందిగా వేడుకుంది. కారు దిగి కాన్వెంట్‌లో ఏనుగులు చేసిన బీభత్సం చూడాల్సిందిగా రిన్సీ మంత్రిని కోరింది. మంత్రి కారును ఆపడం గమనించిన పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి రిన్సీని పక్కకు వెళ్లాల్సిందిగా సూచించారు. రిన్సీ ఫిర్యాదు చేస్తుంటే మంత్రి కారులో నుంచి దిగలేదు సరికదా కనీసం కారు అద్దాన్ని కూడా పూర్తిగా దించలేదు. అంతేకాక చాలా నిర్లక్ష్యంగా గ్రీవెన్స్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తానని చెప్పారు.

ఈ మొత్తం తతంగాన్నంతా అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోను దాదాపు 9లక్షల మందికి పైగా వీక్షించారు.

మరిన్ని వార్తలు