ఎయిర్‌ హోస్టెస్‌ ముఖంపై వేడి నీళ్లు.. జరిగిందేమిటంటే!

16 Aug, 2019 15:41 IST|Sakshi

చూడటానికి అందంగా కనిపించే ఎయిర్‌ హోస్టెస్‌ తమ విధులు సక్రమంగా నిర్వహించడానికి ఎంత కష్టపడతారో చాలా మందికి తెలియదు. విమానంలోని ప్రయణికులకు ఆహారం అందించడంతో పాటు వారిని జాగ్రత్తగా చూసుకోవడమనేది చిన్న విషయం కాదు. ప్రయాణికులు తమ పట్ల ఎంత కఠినంగా ప్రవర్తించిన వారు నిస్సహాయులుగా ఉండిపోవాల్సిందే. వారు కోపానికి వచ్చిన, అసభ్య పదజాలం వాడిన కూడా భరించాల్సిందే. వారికి తిరిగి ఎదురుచెప్పే అవకాశం ఉండదు.. ఒకవేళ అలా చేస్తే ఉద్యోగం ఉండదనే భయం. ఇది వారి పరిస్థితి. 

గత కొంతకాలంగా ఎయిర్‌ హోస్టెస్‌లతో కొందరు ప్రయాణికులు అమర్యాదగా ప్రవర్తించిన ఘటనలు బయటికొస్తున్న.. ఇంకా అలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అటువంటి వారిపై సంబంధిత అధికారులు కానీ, సంస్థలు కానీ కఠిన చర్యలు తీసుకోకపోవడమే అందుకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల కిందట ఎయిర్‌ ఏషియాకు చెందిన ఫ్లైట్‌లో జరిగిన ఓ భయానక సంఘటనను తాను ఇప్పటికి మరచి పోలేకపోతున్నానని చెబుతున్నారు ఓ ఎయిర్‌ హోస్టెస్‌.

ఎయిర్‌ ఏషియాలో ఎయిర్ హోస్టెస్‌గా విధులు నిర్వహిస్తున్న నురాలియా మజ్లాన్.. తన సహోద్యోగిపై జరిగిన దాడిని వివరించారు. ‘కొన్నాళ్ల కిందట ఆ ఎయిర్‌ హోస్టెస్‌తో చైనాకు చెందిన ఓ ప్రయాణికురాలు దురుసుగా ప్రవర్తించింది. అదే ఫ్లైట్‌లో ఉన్న తన బాయ్‌ఫ్రెండ్‌ పక్కన ఆమెకు కూర్చొనే అవకాశం దక్కలేదు. సీట్ల మార్పుకు ఇతర ప్రయాణికులు అంగీకరించలేదు. దీంతో ఆవేశానికి లోనైన ఆమె ఎయిర్‌ హోస్టెస్‌పై దాడి చేసింది. ఎయిర్‌ హోస్టెస్‌ ముఖంపై న్యూడిల్స్‌ కప్‌లోని వేడి నీళ్లను విసిరింది. అంతటితో ఆగకుండా ఎయిర్‌ హోస్టెస్‌పై పెద్దగా కేకలు వేసింది.
    
అసలు ఏ మాత్రం సంబంధం లేని అంశంలో ఎయిర్‌ హోస్టెస్‌పై తన కోపాన్ని ప్రదర్శించింది. ఎందుకంటే తిరిగి ఆమె ప్రశ్నించలేదనే ధీమాతో. దీనిని గమనించిన ఇతర సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెని సముదాయించే ప్రయత్నం చేస్తూంటే.. ఆమె మాత్రం ఇంకా తన కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. తర్వాత అక్కడికి చేరుకున్న ఆమె బాయ్‌ఫ్రెండ్‌ కూడా విమానాన్ని పేల్చి వేస్తానని బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత విమానం ల్యాండ్‌ కాగానే ఆమెను ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత కఠినంగా ప్రవర్తించిన ఆమెను మాత్రం సదురు ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించకుండా నిషేధం విధించార’ని నురాలియా తెలిపారు. తాము యూనిఫామ్‌ ధరించి నిస్సహాయంగా ఉంటాం కాబట్టే కొందరు ప్రయాణికులు ఇలా దురుసుగా ప్రవర్తిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా