మీడియాపై ఫైర్‌ అయిన మహిళా ఎంపీలు

25 Jun, 2019 18:30 IST|Sakshi

కోల్‌కతా : తృణముల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నుంచి పోటీచేసి తొలిసారి ఎంపీగా  ఎన్నికయిన నుస్రత్‌ జహాన్, మిమి చక్రవర్తీలు లోక్‌సభ  సభ్యులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారం అనంతరం బయటకు వచ్చిన మహిళా ఎంపీల చుట్టూ విలేకరుల గుమిగూడారు. వారిని కదలనీయకుండా చుట్టుముట్టి.. ప్రశ్నలు అడుగుతూ.. ఫోటోలు తీస్తూ ఇబ్బంది పెట్టారు. ముందుకు వెళ్లడానికి దారి లేకుండా చుట్టూ చేరారు. ఒకానొక సమయంలో ఈ మహిళా ఎంపీలు తిరిగి పార్లమెంట్‌లోకి వెళ్దామనుకున్నారు. కానీ అది కూడా వీలు పడలేదు. దాంతో తమకు దారి ఇవ్వాల్సిందిగా విలేకరులను కోరారు. అయితే వారి మాటలను ఎవరూ పట్టించుకోలేదు.

దాంతో సహనం కోల్పోయిన ఈ యువ ఎంపీలు విలేకరుల మీద మండి పడ్డారు. ‘మీరంతా ఇలా చుట్టుముట్టడం చాలా ఇబ్బందిగా ఉంది. మమ్మల్ని పడేస్తారా ఏంటి.. అర్థం చేసుకోండి.. మమ్మల్ని వెళ్లనివ్వండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి ఇబ్బంది గమనించిన భద్రతా సిబ్బంది అక్కడకు వచ్చి.. ఎంపీలు వారి వాహనం వద్దకు వెళ్లేందుకు సాయం చేశారు. కారు దగ్గరకి వచ్చాక కూడా విలేకరులు వీరిని వదిలిపెట్టలేదు. ఒక్క ఫోటో అంటూ ఇబ్బంది పెట్టారు. దాంతో ఈ మహిళా ఎంపీలు క్యూలైన్లో తమకు దూరంగా నిలబడితే ఫోటో దిగుతామని కండిషన్‌ పెట్టి.. ఫోటోలు దిగి అక్కడ నుంచి బయటపడ్డారు.

మరిన్ని వార్తలు