పౌష్టికాహార చాంపియన్‌ ఒడిశా

1 Sep, 2019 03:20 IST|Sakshi

భారత్‌లో అత్యంత వెనుకబడిన రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి. అయినా చిన్నారుల పౌష్టికాహార సూచీలో ఆ రాష్ట్రమే చాంపియన్‌. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలను అధిగమించడంలో ఆ రాష్ట్రం చాలా ముందుందని అంతర్జాతీయ ఆహార విధాన అధ్యయన సంస్థ (ఐఎఫ్‌పీఆర్‌ఐ) వెల్లడించింది. వాషింగ్టన్‌కు చెందిన ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఐదేళ్ల లోపు పిల్లల్లో 2005–06 సంవత్సరంలో 46.5 శాతం పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతుంటే 2015–16 సంవత్సరం వచ్చేసరికి వారి సంఖ్య 35.3 శాతానికి తగ్గిపోయింది. ఇక తక్కువ బరువున్న పిల్లల శాతం కూడా గణనీయంగా తగ్గిపోయింది. 2005–06లో 42.3 శాతం తక్కువ బరువున్న పిల్లల సంఖ్య 2015–16 వచ్చేసరికి 35.8 శాతానికి తగ్గిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం గర్భిణుల మీద అత్యధికంగా దృష్టి సారించింది.

ఒడిశాలో ‘నవీన్‌ పట్నాయక్‌ సర్కార్‌ పౌష్టికాహార పథకం’లో భాగంగా గర్భిణులకు పప్పులు, గోధుమ, బార్లీ, బియ్యంతో పాటు చటువా అనే ఆహార పదార్థాన్ని తయారుచేసి ఇస్తారు. దాంతో పాటు బాదంతో తయారుచేసిన లడ్డూలు, నెలకు 8 గుడ్లు రేషన్‌ కింద ఇస్తారు. బిడ్డ పుట్టాక కూడా గోధుమ రవ్వ ఇస్తారు. బిడ్డకి 9 నెలలు వచ్చే వరకు వారిద్దరి ఆరోగ్యంపై శద్ధ చూపుతారు. దానికితోడు ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్ (ఐసీడీఎస్‌) పథకం, మధ్యాహ్నభోజన పథకం వంటివి అమలు చేయడంలో ఒడిశాలో పరిపాలనా యంత్రాంగం చేసిన కృషి ఒడిశాను నవంబర్‌ వన్‌ను చేసింది. కానీ ధనిక రాష్ట్రాల జాబితాలో ఉన్న కర్ణాటక.. చిన్నారుల పౌష్టికాహారం విషయంలో ఆఖరి స్థానంలో ఉంది. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలకు సంబంధించిన పథకాల్లో అత్యంత తక్కువ బడ్జెట్‌ కేటాయించడం వల్లే ఆ రాష్ట్రం వెనుకబడి ఉన్నట్లు యూనిసెఫ్‌ సర్వేలో వెల్లడైంది. 

మరిన్ని వార్తలు