ఓహో.. మోదీ!

17 Apr, 2015 01:31 IST|Sakshi
ఓహో.. మోదీ!

సంస్కరణల సారథిగా అభివర్ణించిన ఒబామా

టైమ్ మేగజైన్‌లో మోదీ ప్రొఫైల్ రాసిన అమెరికా అధ్యక్షుడు
‘ఇండియాస్ రిఫార్మర్ ఇన్ చీఫ్’గా కితాబు
‘పేదరికం నుంచి ప్రధానమంత్రి వరకు’ అంటూ మోదీ జీవన ప్రస్థానంపై కథనం
కృతజ్ఞతలతో స్పందించిన భారత ప్రధానమంత్రి

 
{పధాని నరేంద్రమోదీకి అరుదైన, అద్భుతమైన, అనూహ్య గౌరవం లభించింది. ప్రఖ్యాత ‘టైమ్’ పత్రికలో మోదీ ప్రొఫైల్(వ్యక్తిత్వ వర్ణన)ను అగ్రదేశం అమెరికా అధినేత బరాక్ ఒబామా స్వయంగా రాసి.. భారత ప్రధానితో తనకున్న ఆత్మీయ స్నేహానుబంధాన్ని చాటారు. టైమ్ మేగజైన్ ప్రచురించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో చోటు సాధించిన  మోదీని.. ‘భారత్‌లో సంస్కరణల సారథి (రిఫార్మర్ ఇన్ చీఫ్)’గా ఒబామా అభివర్ణించారు. మోదీ గురించి ‘టైమ్’లో తాను రాసిన వ్యాసానికీ ఒబామా అదే శీర్షిక పెట్టారు. ‘పేదరికం నుంచి ప్రధానమంత్రి వరకు’ అంటూ మోదీ జీవన ప్రస్థానాన్ని అందులో స్ఫూర్తివంతంగా వివరించారు. టైమ్ మేగజైన్‌లో తన ప్రొఫైల్ రాసిన బరాక్ ఒబామాకు నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఒబామా వ్యాఖ్యలు హృదయానికి హత్తుకునేలా, స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. టైమ్ మేగజైన్‌కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు.     
 
న్యూయార్క్: భారత ప్రధాని మోదీ నాయకత్వ సామర్థ్యాన్ని,  సానుకూల వ్యక్తిత్వాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అక్షరబద్ధం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది జాబితాను ప్రచురించిన టైమ్ మేగజైన్‌లో.. ఆ జాబితాలో చోటు సంపాదించిన మోదీ ప్రొఫైల్‌ను స్వయంగా ఒబామానే రాసి.. భారతదేశ ప్రధానికి తానిచ్చే ప్రాధాన్యతను చెప్పకనే చెప్పారు.

మోదీ జీవితం భారతదేశ ప్రగతిశీల సామర్థ్యాన్ని, చలనశీలతను ప్రతిబింబిస్తుందని తన వ్యాసంలో ఒబామా వర్ణించారు. ‘ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆయన అధినేత. పేదరికం నుంచి ప్రధానమంత్రి పదవి వరకు సాగిన ఆయన జీవన పయనం.. భారతదేశ ప్రగతిశీల సామర్థ్యాన్ని, ఆ దేశ చలనశీలతను ప్రతిబింబిస్తుంది, తన మార్గంలో మరింతమంది భారతీయులు పయనించేలా స్ఫూర్తినిస్తుంది. దేశంలో దారుణంగా నెలకొని ఉన్న పేదరికాన్ని తగ్గించడం, విద్యారంగంలో ప్రమాణాలు పెంచడం, మహిళలు, బాలికలకు సాధికారత కల్పించడం, వాతావరణ మార్పు సమస్యను ఎదుర్కొంటూనే భారతదేశ ఆర్థిక ప్రగతి వాస్తవ సామర్థ్యాన్ని వెలికితీయడం.. లక్ష్యాలుగా ఆయన ఒక ప్రతిష్టాత్మక, దార్శనిక కార్యక్రమాన్ని చేపట్టారు. భారతదేశం లాగానే ఆయన ప్రాచీన, ఆధునిక భావనల వారధి. సంప్రదాయ యోగాకు ప్రాచుర్యం కల్పిస్తూనే.. ట్వీటర్‌లో ప్రజలతో అనుసంధానమవుతూ డిజిటల్ ఇండియాను స్వప్నిస్తుంటారు’ అంటూ మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. ‘వందకోట్లకు పైగా భారతీయులు ప్రగతిపథంలో ఐక్యంగా ముందుకుసాగితే ప్రపంచానికే స్పూర్తినివ్వగలరని ప్రధానమంత్రి మోదీ గుర్తించారు’ అని పేర్కొన్నారు.

గత సంవత్సరం మోదీ అమెరికా వచ్చిన సందర్భంగా తామిరువురు పౌర హక్కుల పోరాట యోధుడు డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ స్మారక కేంద్రం వద్దకు నివాళులర్పించడానికి వెళ్లిన విషయాన్ని ఒబామా గుర్తు చేసుకున్నారు. ‘అప్పుడు లూథర్ కింగ్, మహాత్మాగాంధీల బోధనలను గుర్తు చేసుకున్నాం. భారత్, అమెరికాల్లోని భిన్నమైన నేపథ్యాలు, విశ్వాసాలు మనకు అందించిన శక్తిసామర్థ్యాలను ఎలా కాపాడుకోవాలనే విషయంపై మాట్లాడుకున్నాం’ అని ఒబామా రాశారు. టైమ్ పత్రిక ప్రకటించిన 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో.. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్‌జాయి, ఐసీఐసీఐ చీఫ్ చందా కొచ్చర్, ఆపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్, రియాలిటీ స్టార్ కిమ్ కర్దాషియన్, నటుడు బ్రాడ్లీ కూపర్, నటి, మహిళాహక్కుల కార్యకర్త ఎమ్మా వాట్సన్, జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్, పోప్ ఫ్రాన్సిస్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. తదితరులున్నారు. ఒబామా ప్రొఫైల్‌ను టైమ్ మేగజైన్‌లో రాజకీయ వ్యవహారాల వ్యాసకర్త జో క్లీన్ రాశారు.
 

మరిన్ని వార్తలు