మెట్రోలో ముందే సీట్ల బుకింగ్‌?

6 Jan, 2016 11:24 IST|Sakshi
మెట్రోలో ముందే సీట్ల బుకింగ్‌?

సంపన్నుల కోసం ప్రీమియం సీట్లు ఏర్పాటుచేయాలి
సామాన్యులకూ మరింత సుఖవంతం చేయాలి
మెట్రో రైళ్ల రాకపోకలను మరింత పెంచాలి
ఢిల్లీ మెట్రోకు సుప్రీంకోర్టు సూచన

న్యూఢిల్లీ: ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో ప్రవేశపెట్టిన 'సరి-బేసి' అంకెల విధానానికి మద్దతుగా సుప్రీంకోర్టు కొన్నిచర్యలను ప్రతిపాదించింది. ఈ విధానం కారణంగా తమ లగ్జరీ వాహనాలు ఉపయోగించుకోలేని సంపన్నులు, ధనికులు, ప్రముఖుల కోసం 'సౌకర్యవంతమైన ప్రీమియం సీట్లు' ఏర్పాటు చేయాలని ఢిల్లీ మెట్రోరైల్‌ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)కు సూచించింది.

ప్రయాణికులు సాధారణ ధర కంటే ఐదు, ఆరు రెట్లు అధిక ధర చెల్లించి.. మెట్రో రైలులో సీట్లను ముందే బుక్‌ చేసుకునేలా ప్రీమియం సర్వీసులను అందుబాటులోకి తెచ్చే అవకాశాలను డీఎంఆర్సీ పరిశీలించాలని తెలిపింది. 'కారు యజమానులు మెట్రో కోసం వచ్చినప్పుడు వారికి కూర్చొనేందుకు తగిన చోటు కల్పించాలి. ఉదాహరణకు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ లాంటి వారికి మెర్సిడెస్, టయోటా వంటి భారీ వాహనాలున్నాయి. అలాంటి వారు మెట్రో ఉపయోగించుకోవడానికి వీలుగా మీరు సదుపాయాలు ఎందుకు కల్పించకూడదు' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. సామాన్య ప్రయాణికుల కోసం కూడా మెట్రో రవాణా సదుపాయాన్ని మరింత సుఖవంతం చేయాలని, రైళ్ల రాకపోకలను మరింతగా పెంచాలని న్యాయస్థానం సూచించింది. 

మరిన్ని వార్తలు