‘తోటి ఆర్టిస్టును కించపరిచావు..పిచ్చి పట్టిందా’

30 Aug, 2019 14:00 IST|Sakshi

నేటి డిజిటల్‌ యుగంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రస్తుతం అందరూ టిక్‌టాక్‌ యాప్‌లో మునిగితేలుతున్నారు. ఎంతో మంది తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూ సెలబ్రిటీలుగా మారుతుంటే.. కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న ఓ ఒడిశా నటుడు మాత్రం తన అత్యుత్సాహం, బిత్తిరితనంతో విమర్శల పాలవుతున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రణు మొండల్‌ అనే ఓ సామాన్యురాలు తన అద్భుత గాత్రంతో దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌ పాటలను ఆలపిస్తూ ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె మధురమైన గానానికి ముగ్ధుడైన బాలీవుడ్‌ సంగీత దర్శకుడు హిమేశ్‌ రేష్మియా రణు చేత ఓ పాటను రికార్డు చేయించాడు. ‘తేరీ మేరీ కహానీ’ అంటూ సాగే పాటను ఆలపిస్తున్న రణు పక్కనే ఉండి ఆమెను ఉత్సాహపరుస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

ఈ నేపథ్యంలో ఒడిశా కమెడియన్‌, పప్పు పామ్‌ పామ్‌గా ఫేమస్‌ అయిన తత్వా ప్రకాశ్‌ సతపతి ఈ వీడియోపై టిక్‌టాక్‌లో తన ‘సృజనాత్మకత’ ప్రదర్శించాడు. పాట రికార్డింగ్‌ సమయంలో రణు కట్టుకున్న రంగు చీరను కట్టుకుని, ఆమెలా హావభావాలు పలికిస్తూ మైక్ ముందు నిల్చుని రణును అనుకరించాడు. ఇక అదే సమయంలో మరో వ్యక్తి హిమేశ్‌ రేష్మియాలా పప్పును ఉత్సాహపరిచాడు. ఈ క్రమంలో రణును కించపరిచేలా ఉన్న ఈ టిక్‌టాక్‌ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘పప్పూకి పిచ్చెక్కిందేమో. మతిస్థిమితం తప్పినట్లుంది. ఒకసారి ఆయనను సైకియాట్రిస్ట్‌ దగ్గరికి తీసుకువెళ్లాలి. తోటి కళాకారిణిని అవమానించే ముందు ఒక్కసారైనా ఆలోచించవచ్చు కదా’ అంటూ ప్రకాశ్‌ సతపతిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. 

కాగా ఈ విషయంపై స్పందించిన ప్రకాశ్‌ అసిస్టెంట్‌ ఆయన సరదా కోసం మాత్రమే వీడియో చేశారని చెప్పుకొచ్చాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రణు రైల్వే స్టేషనులో పాట పాడుతుండగా గమనించిన అతీంద్ర చక్రవర్తి అనే ఓ యువ ఇంజనీర్‌ ఆమె పాటను రికార్డు చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన రణుకు హిందీ చానెల్‌ అవకాశమిచ్చింది. ఆమె లుక్‌ను పూర్తిగా మార్చివేసి సెలబ్రిటీగా ప్రేక్షకుల ముందు నిలబెట్టింది. ఇక ఆమెకు నేపథ్య గాయనిగా అవకాశం ఇచ్చిన హిమేశ్‌ మరో పాట కోసం కూడా రణునే ఎంచుకున్నాడు.

మరిన్ని వార్తలు