పీప్లీ హత్యాచార కేసు : ఒడిషా మంత్రి రాజీనామా

6 Jan, 2019 19:54 IST|Sakshi

భువనేశ్వర్‌ : పిప్లీ హత్యాచార ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఒడిషా వ్యవసాయ మం‍త్రి ప్రదీప్‌ మహారథి ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. విపక్ష కాంగ్రెస్‌, బీజేపీలు మహారథి రాజీనామాకు పట్టుబట్టాయి. ఈ కేసులో ఇద్దరు నిందితులను భువనేశ్వర్‌ కోర్టు నిర్ధోషులుగా ప్రకటించడంతో వారికి అనుకూలంగా మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తన అనుచరులైన నిందితులకు న్యాయస్ధానం విముక్తి కల్పించడంతో సత్యం గెలుపొందిందని ఆయన చేసిన వ్యాఖ్యలపై విపక్ష కాంగ్రెస్‌, బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేశాయి.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టారు. మహిళల పట్ల ఒడిషా సర్కార్‌ చులకనభావాని మంత్రి వ్యాఖ్యలు నిదర్శనమని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు మంత్రి నివాసం ఎదుట ధర్నా చేసి ఆయన ఇంటిపై టమాటాలు, కోడిగుడ్లు విసిరి ఆందోళన నిర్వహించారు. కాగా, తన వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తడంతో క్షమాపణలు కోరిన మహారథి తాజాగా మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్టు వెల్లడించారు. 2011, నవంబర్‌ 28న పిప్లీలోని వ్యవసాయ భూమిలో 19 సంవత్సరాల బాలిక స్పృహ కోల్పోయి అచేతనంగా పడిఉండటాన్ని గుర్తించారు. లైంగిక దాడికి గురైన బాలిక కటక్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2012 జూన్‌ 21న మరణించారు.

మరిన్ని వార్తలు