మే 30న సాయంత్రం 5.30 గంట‌ల‌కు

28 May, 2020 20:27 IST|Sakshi

భువ‌నేశ్వ‌ర్‌: క‌రోనాను నియంత్రించేందుకు వైద్యులు, పారామెడిక‌ల్ సిబ్బంది, పోలీసులు, త‌దిత‌రులు అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్నారు. వీరి శ్ర‌మ‌ను గౌర‌విస్తూ మే 30న ఒడిశా గేయ‌మైన "బందే ఉత్క‌ళ జ‌న‌ని "గీతాన్ని ఆల‌పించుదాం అంటూ ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్ర‌జ‌లే కాక ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఒడిశా వాసులంద‌రూ గీతాన్ని పాడి స‌మైక్య‌త‌ను చాటాలని కోరారు. గురువారం ఆయ‌న మాట్లాడుతూ.. "నాలుగున్న‌ర కోట్ల ఒడిశా ప్ర‌జ‌ల‌ను ఒక‌టే కోరుతున్నాను. శ‌నివారం సాయంత్రం 5.30 గంట‌ల‌కు సామాజిక దూరం పాటిస్తూ అంద‌రం బందే ఉత్క‌ళ జ‌న‌ని గేయం ఆలపిద్దాం.

కోవిడ్ వారియ‌ర్స్ అంకిత‌భావాన్ని గౌర‌విస్తూ, వారిని ప్రోత్సహిద్దాం. మ‌న ముందున్న స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొనేందుకు ఇది మన‌కు శ‌క్తినిస్తుంది. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి నుంచి ప్ర‌జ‌ల‌ ప్రాణాల‌ను ర‌క్షించ‌డంలో ఒడిశా భార‌త్‌కే కాకుండా ప్ర‌పంచానికే ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. ప్ర‌పంచంలోనే అతిత‌క్కువ‌ కోవిడ్ మ‌ర‌ణాల రేటు ఒడిశాలో ఉంది. క‌రోనా సోకిన‌వారిలో 50 శాతం మంది పేషెంట్లు కోలుకున్నారు" అని సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌ తెలిపారు. కాగా ఈ పాట ఒడిశా ప్ర‌త్యేక రాష్ట్రం కోసం ఉద్య‌మించిన స‌మ‌యంలో పుట్టుకొచ్చింది. ల‌క్ష్మీకంట మొహ‌పత్ర ఈ పాట‌ ర‌చించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా