సోనూసూద్‌పై సీఎం ప్రశంసల జల్లు

30 May, 2020 19:29 IST|Sakshi

సోనూసూద్‌కు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ధన్యవాదాలు

భువనేశ్వర్‌: వలస కార్మికుల పట్ల ఆపద్భాంధవుడిగా నిలుస్తున్న నటుడు సోనూసూద్‌పై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రశంసలు కురిపించారు. లాక్‌డౌన్‌ కారణంగా కేరళలో చిక్కుకుపోయిన ఒడిశా యువతులను స్వస్థలానికి చేర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు.. ‘‘ఒడిశా అమ్మాయిలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌కు ధన్యవాదాలు. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణంగా కేరళలో చిక్కుకుపోయిన వారిని క్షేమంగా ఇంటికి చేర్చేందుకు చొరవ చూపారు. ఆయన మానవతాదృక్పథాన్ని ప్రశంసించి తీరాల్సిందే’’అని ట్వీట్‌ చేశారు.

ఇక ఇందుకు బదులిచ్చిన సోనూసూద్‌.. ‘‘వేరే రాష్ట్రంలో చిక్కుకుపోయిన అక్కాచెల్లెళ్లను ఇంటికి చేర్చడం నా బాధ్యత అని భావించాను. మీ మాటలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. కృతజ్ఞతలు సర్‌’’ అంటూ గొప్ప మనసు చాటుకున్నారు. అదే విధంగా దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ప్రతీ ఒక్కరికి సహాయం చేసేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని మరోసారి స్పష్టం చేశారు. (అలా జరిగితే నన్ను క్షమించండి: సోనూసూద్‌)

కాగా ఒడిశాకు చెందిన దాదాపు 180 మంది అమ్మాయిలు.. కేరళలోని ఎర్నాకులంలో చిక్కుకుపోయారు. అక్కడే కుట్టుపనులు చేసుకుని ఉపాధి పొందుతున్న వీరు.. లాక్‌డౌన్‌ వల్ల పనిచేసే ఫ్యాక్టరీ మూత పడటంతో సంకట స్థితిలో పడిపోయారు. స్వస్థలాలకు వెళ్లడానికి సరైన మార్గం కనిపించకపోవడంతో కేరళలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సోనూ సూద్‌ వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేకంగా ఓ విమానాన్ని ఏర్పాటు చేసి.. ఇందుకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు తీసుకున్నారు. ఇక లాక్‌డౌన్‌ కాలంలో ఎంతో మంది వలస కార్మికులను స్వస్థలాలకు చేరుస్తున్న సోనూసూద్‌.. హెల్త్‌వర్కర్ల కోసం పీపీఈ కిట్లు విరాళంగా ఇవ్వడంతో పాటుగా తన హోటల్‌ను కూడా క్వారంటైన్‌ సెంటర్‌గా మార్చి రియల్‌ హీరో అంటూ నీరాజనాలు అందుకుంటున్నారు.(వలస కార్మికులను తరలిస్తున్న సోనూసూద్‌)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా