రైతుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యులు?

13 Nov, 2017 18:18 IST|Sakshi

భువనేశ్వర్‌ : కరవు కోరల్లో చిక్కుకుని ఒడిశా రైతు విలవిల్లాడుతున్నారు. మొన్నటి వరకు తెగులు వల్ల వరి పంట నాశనం కాగా, రెండు సార్లు కరవు పరిస్థితులు చుట్టు ముట్టడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోని 8, 211 గ్రామాల పరిధిలోని 1.7 లక్షల హెక్టార్ల పరిధిలో తెగుళ్ల వల్ల వరి పంట నాశనం కాగా, కరవు పరిస్థితుల కారణంగా 15 జిల్లాల్లోని ఆరువేల గ్రామాల పరిధిలో 3.1 లక్షల హెక్టార్లలో వరి పంట నాశనం అయింది. దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అక్టోబర్‌ 25వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 

వరిపంటకు అక్షయ పాత్రగా ప్రసిద్ధి చెందిన ఒడిశాలో 75 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వారిలో 85 శాతం మంది ఒక ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు గల చిన్నకారు, సన్నకారు రైతులే. మున్నెన్నడు లేనంతా తీవ్రంగా ఈసారి కరవు పరిస్థితులు దాపురించడంతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మహేశ్వర్‌ మొహంతి సహాయక చర్యలు ప్రకటించక తప్పలేదు. నీటిపారుదల కలిగిన ప్రాంతాల్లో దెబ్బతిన్న హెక్టార్‌ పంటకు 13,500 రూపాయలు, నీటిపారుదల లేని ప్రాంతాల్లో హెక్టార్‌కు 6,800 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజులను మాఫీ చేశారు. రబీ పంటకు కొత్తగా రుణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 

అలాగే తెగులు, క్రిమికీటకాల వల్ల పంట దెబ్బతిన్న రైతులకు కూడా సహాయక చర్యలు ప్రకటించారు. సబ్సిడీలపై పురుగు మందులు, స్పేయర్లు, పంపుసెట్లు ఇస్తామని చెప్పారు. తెగుళ్ల నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ 22 జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసింది. అలాగే ఈ చర్యలకు సంబంధించి రైతులకు రేడియోలు, స్థానిక పత్రికల ద్వారా సరైన అవగాహక కల్పించాలని కోరంది. కరువు పరిస్థితులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోక పోవడం, పురుగు మందులను రైతులకు సకాలంలో అందజేయడంలో విఫలమవడం కూడా భారీ నష్టానికి దారితీసిందని చెప్పవచ్చు. ఇక వాతావరణంలో హఠాత్తుగా సంభవిస్తున్న మార్పులు వర్షాభావ పరిస్థితులకు దారితీస్తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. 

రైతుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని, కుటుంబంలో ఒకరి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు