టిట్లీ అలర్ట్‌ : ఒడిశాలో హైఅలర్ట్‌

10 Oct, 2018 10:41 IST|Sakshi

భువనేశ్వర్‌ : ఒడిశా- ఏపీ తీరంలో టిట్లీ తుపాన్‌ ముంచుకొస్తోందన్న భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాన్‌తో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకోకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ముందస్తు చర్యలకు సంసిద్ధమైంది. తీర ప్రాంత జిల్లాల్లో హై అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తోంది. పెద్ద ఎత్తున ఆహారపదార్ధాల నిల్వలను ప్రభావిత ప్రాంతాలకు చేరవేయడంతో పాటు ప్రజలను సైక్లోన్‌ షెల్టర్లకు తరలించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏపీ పాధి పేర్కొన్నారు. మరోవైపు గంజాం, గజపతి, పూరీ, జగత్‌సింగ్‌పూర్‌ ప్రాంతాల్లోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు.

గతంలో 2013లో ఫైలిన్‌, 2014లో హుద్‌హుద్‌ తుపాన్‌ సమయంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకుండా విపత్తు నిర్వహణ చేపట్టామని ఆయన గుర్తుచేశారు. టిట్లీ తుపాన్‌ ధాటికి గంటకు 100 నుంచి 110 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, బుధవారం నాటికి తుపాన్‌ విస్తరించి తీవ్రరూపు దాల్చుతుందని ఐఎండీ అంచనా వేసినట్టు వెల్లడించారు.

ప్రభుత్వ కార్యదర్శులు, సహాయ పునరావాస కమిషనర్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలతో ప్రధాన కార్యదర్శి నిర్వహించిన అత్యున్నత స్ధాయి సమావేశంలో తుపాన్‌ పరిస్థితిని సమీక్షించారు. కాగా బుధ, గురువారాల్లో ఒడిశాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్‌అలర్ట్‌ జారీ చేసింది. కాగా టిట్లీ ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్‌పూర్‌ తీరానికి 510 కి.మీ. దూరంలో ఏపీలోని కళింగపట్నం తీరానికి 460 కిలోమీటర్ల దూరం మధ్య కేంద్రీకృతమైందని వాతావరణ విభాగం పేర్కొంది.

>
మరిన్ని వార్తలు