భుజాన తల్లిదండ్రులతో న్యాయపోరాటం...

1 Sep, 2017 08:40 IST|Sakshi
భుజాన తల్లిదండ్రులతో న్యాయపోరాటం...
సాక్షి, మయూర్భంజ్‌:  ఒడిశాలో ఓ గిరిజన వ్యక్తి న్యాయపోరాటం చర్చనీయాంశంగా మారింది. తనపై నమోదయిన ఫేక్‌ కేసులో న్యాయం చేకూర్చాలంటూ తల్లిదండ్రులను భుజాన మోసుకుంటూ సుమారు 40 కిలోమీటర్లు నడిచాడు. పురాణాల్లో శ్రవణ కుమారుడిని గుర్తు చేసిన ఈ ఘటన మయూర్భంజ్‌ జిల్లాలో చోటు చేసుకుంది.
 
2009లో మోరోదా గ్రామానికి చెందిన కార్తీక్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు ఓ కేసులో 18 రోజులపాటు జైల్లో ఉంచారు. అయితే ఆ కేసు మూలంగా గ్రామస్తులు అతన్ని ఊరి నుంచి బహిష్కరించారు. చేసేందుకు పని కూడా దొరక్కపోవటంతో కుటుంబం గడవటం కష్టంగా మారింది. దీనంతటికి తనపై కేసు ఆరోపణలు రావటమే కారణమని భావించిన యువకుడు న్యాయం కోసం పోరాటానికి దిగాడు. 
 
వృద్ధులైన తన తల్లిదండ్రులను భుజాన కావడిలా వేసుకుని 40 కిలోమీటర్లు నడిచాడు. ఆరేళ్లుగా కేసు కోర్టులో పెండింగ్‌ లోనే ఉంది. ‘నాకేం తెలీకపోయినా తప్పుడు కేసు పెట్టారు. పూట గడవటమే కష్టంగా ఉంది. నా తల్లిదండ్రులు చనిపోయే లోపు నేను నిర్దొషినని నిరూపించుకోవాలి’ అని కార్తీక్‌ చెబుతున్నాడు. ఇక కార్తీక్ వ్యవహారాన్ని ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి స్పందన లేదని సామాజిక వేత్త, న్యాయవాది కుమార్ పాత్ర వెల్లడించారు. 
 
‘ కేసు కోర్టులో ఇంకా నడుస్తూనే ఉంది. అతను(కార్తీక్) అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోయి ఉన్నాడు. చదువుకున్న వ్యక్తే అయినా చేసేందుకు పని ఇవ్వటం లేదు. గ్రామ బహిష్కరణ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదు. కనీసం ఉపాధి కల్పన పథకాల కింద అతని పని కూడా ఇప్పించటం లేదు’ అని కుమార్‌ చెబుతున్నారు.
మరిన్ని వార్తలు