గుడిసె కూలిపోవడంతో.. టాయిలెట్‌లోనే జీవనం!

18 May, 2019 16:22 IST|Sakshi

భువనేశ్వర్‌ : ఫొని తుపాను తన జీవితాన్ని ఆగమ్యగోచరంగా మార్చిందని ఓ దళిత వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. తుపాను ధాటికి తన గుడిసె కూలిపోవడంతో ప్రస్తుతం టాయిలెట్‌లో నివసిస్తున్నానంటూ దీనస్థితిని వివరించాడు. వివరాలు.. భారీ వర్షాలు, గాలులతో ఫొని తుపాను ఒడిశాలో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రపర జిల్లాలోని రఘుదీపూర్‌ గ్రామం అల్లకల్లోమైంది. ఈ ప్రకృతి వైపరీత్యంలో ఖిరోడ్‌ జేనా అనే దళిత వ్యక్తి గుడిసె కూలిపోయింది. దీంతో రోజువారీ కూలీ అయిన జేనా కుటుంబం రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా తమకు కేటాయించిన బాత్‌రూంలోనే జేనా కుటుంబం కాలం వెళ్లదీస్తోంది.

ఈ విషయం గురించి జేనా మాట్లాడుతూ..‘ తుపాను కారణంగా నా ఇళ్లు నాశనమైంది. అయితే ఈ పక్కా టాయిలెట్‌ ఎండా వానల నుంచి ప్రస్తుతం మమ్మల్ని రక్షిస్తోంది. నాతో పాటు నా భార్య, ఎదిగిన ఇద్దరు కూతుళ్లను కాపాడుతోంది. అయితే ఇక్కడ ఎన్నాళ్లు ఉండనిస్తారో తెలియదు. ఇక్కడ ఉంటున్న కారణంగా బహిరంగ విసర్జనకు వెళ్లాల్సి వస్తోంది. మళ్లీ ఇళ్లు కట్టుకునేందుకు నాకు ఎటువంటి జీవనాధారం లేదు. కూలీ చేస్తేనే రోజు గడుస్తుంది. తుపాను సహాయక నిధులు అందేదాకా మాకు ఈ దుస్థితి’ తప్పదు అని తుపాను బాధితులు ఎదుర్కునే ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు. కాగా ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద పక్కా ఇళ్లుకు దరఖాస్తు చేసుకున్నానని పేర్కొన్నాడు. ఈ విషయంపై స్పందించిన జిల్లా గ్రామీణాభివృద్ధి ఏజెన్సీ అధికారి జేనా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. తుపాను సహాయక నిధులతో పాటు పక్కా ఇళ్లు కూడా మంజూరయ్యేలా చేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు