మోదీగారు మీ హామీ నిలబెట్టుకోండి..

16 Jun, 2018 16:24 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముక్తికాంత్‌

ఆగ్రా : ఎన్నికలప్పుడు నాయకులు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటారు. కానీ అవన్నీ ప్రచారం వరకు మాత్రమే పరిమితం. ఆ తర్వాత వాటి గురించి ఆలోచించే వారు చాలాకొద్ది మంది మాత్రమే ఉంటారు. నాయకులు హామీలు నెరవేర్చకపోతే ప్రజలు కష్టపడాల్సి వస్తుంది. కానీ ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం అలా ఉండలేక పోయాడు. ఎన్నికలప్పుడు తమ గ్రామానికి ఇచ్చిన హామీలను నెరవేర్చండంటూ పాదయాత్ర ప్రారంభించాడు. అది కూడా ఒడిశాలోని రూర్కెలా నుంచి ఆగ్రా వరకు దాదాపు 1,350 కి.మీ మేర పాదయాత్ర చేశాడు. ఇంతదూరం నిరాటంకంగా ప్రయాణించడంతో అతని ఆరోగ్యం దెబ్బతిన్నది. ప్రస్తుతం ఆగ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడే రూర్కెలాకు చెందిన ముక్తికాంత్‌ బిస్వాల్‌.

ఆ వివరాలిలా.. ముక్తికాంత్‌ ఒడిశా రూర్కెలా ప్రాంతంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన వాడు. ఇతని గ్రామానికి సమీపానే ప్రసిద్ధ ‘రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం’ ఉంది. ఆ కర్మాగారం నుంచి విడుదలయ్యే వ్యర్ధాల వల్ల ముక్తికాంత్‌ గ్రామ ప్రజలు నిత్యం ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుండేవారు. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిమిత్తం మోదీ ముక్తికాంత్‌ గ్రామాన్ని సందర్శించారు.

ఆ సందర్భంగా మోదీ ‘రూర్కెలా ఇస్పాట్‌ జనరల్‌ ఆస్పత్రి’లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికలు అయిపోయాయి. మోదీ ప్రధాని పదవి చేపట్టి కూడా నాలుగేళ్లు గడిచిపోయాయి. కానీ మోదీ ముక్తికాంత్‌ గ్రామానికి ఇచ్చిన హామీని మాత్రం నెరవేర్చలేదు. మోదీ తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని ఇన్నాళ్లు ఆశగా ఎదురు చూసారు ముక్తికాంత్‌ గ్రామ ప్రజలు. కానీ వారి ఎదురుచూపులు నిజం కావని తెలియడంతో ముక్తికాంత్‌ తనే స్వయంగా ప్రధాని  మోదీని  కలిసి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేయాలని భావించాడు.

అంతేకాక తమ గ్రామ సమస్య దేశ ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేస్తూ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే చేతిలో జాతీయ జెండాను పట్టుకుని తమ గ్రామం నుంచి హైవే మీదుగా పాదయాత్ర ప్రారంభించాడు. ఈ ఏప్రిల్‌లో రూర్కెలా నుంచి మొదలైన ఈ పాదయాత్ర ఆగ్రా చేరుకుంది. కానీ అప్పటికే ముక్తికాంత్‌ ఆరోగ్యం దెబ్బతినడంతో అతన్ని ఆగ్రా ఆస్పత్రిలో చేర్చారు.

ఈ సందర్భంగా ముక్తికాంత్‌ ‘ప్రధాని మోదీ ఎన్నికల సమయంలోనూ, అలానే 2015లో మా గ్రామానికి వచ్చినప్పుడు కూడా రూర్కెలా ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించడమే కాక బ్రాహ్మణి వంతెనను కూడా పూర్తి చేస్తానన్నారు. సరైన వైద్యం లభించక మా ఊరిలో నిత్యం ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా మోదీ గారు మా గ్రామానికి ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుకుంటున్నా’నని తెలిపాడు.

>
మరిన్ని వార్తలు