మావోయిస్టు అగ్రనేత పండా అరెస్టు

19 Jul, 2014 02:45 IST|Sakshi
మావోయిస్టు అగ్రనేత పండా అరెస్టు

బరంపురంలో ఆయన తలదాచుకున్న ఇంటిపై అర్ధరాత్రి పోలీసుల దాడి
 
పెద్ద ఎత్తున బంగారం, నగదు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు స్వాధీనం
వీహెచ్‌పీ నేత లక్ష్మణానంద హత్య కేసుతో పాటు పండాపై 61 కేసులు

 
బరంపురం: మావోయిస్టు అగ్రనేత, ఒడిశా మావోయిస్టు పార్టీ వ్యవస్థాపకుడు సవ్యసాచి పండా అలియాస్ శరత్ అలియాస్ సుమన్ అలియాస్ సునీల్‌ను గురువారం అర్ధరాత్రి ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బరంపురంలో తలదాచుకుంటున్న పండాను గంజాం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. పండావద్ద బంగారం, నగదు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. సవ్యసాచి పండా అరెస్టయినట్టు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్  శుక్రవారం  శాసనసభలో ప్రకటించారు. పండా అరెస్ట్ ఒడిశా పోలీసులు సాధించిన విజయమని ఆయన  అభినందించారు.  ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో బరంపురంలోని ఒక ఇంటిలో పోలీసులు పండాను అరెస్టు చేశారన్నారు. విశ్వ హిందూ పరిషత్ నేత స్వామి లక్ష్మణానంద సరస్వతి హత్య, నయాగడ్ ఠాణా, ఆయుధాగారంపై దాడి, ఆయుధ దోపిడీ, ఆర్. ఉదయగిరి ఠాణాపై దాడి,  ఇద్దరు ఇటాలియన్ల అపహరణ తదితర కేసుల్లో సవ్యసాచికి ప్రమేయం ఉంది. 25 మంది పోలీసులు, 34 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలతోనూ ప్రత్యక్ష ప్రమేయం ఉంది. మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో పండా 1995 నుంచి చురుకుగా పాల్గొంటున్నారు. ఒడిశాలోని రాయగడ, గజపతి, కొంథమాల్, నయాగడ్ జిల్లాల్లో మావోయిస్ట్ కార్యకలాపాలలో కీలకంగా పనిచేశారు.  ఈ జిల్లాల్లో ఆయనపై 61 కేసులు నమోదయ్యాయి. మోస్టు వాంటెడ్ జాబితాలో ఉన్న సవ్యసాచిని పట్టించే వారికి రూ. 5 లక్షల నగదు పురస్కారాన్ని ఒడిశా ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.

బంగారం, నగదు స్వాధీనం

పండా వద్ద పెద్దమొత్తంలో బంగారం, నగదు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు లభించాయని ఒడిశా డీజీపీ సంజీవ్ మారిక్ తెలిపారు. పండా వద్ద ఆటోమేటిక్ పిస్టల్, తూటాలు, *2 లక్షల నగదు, అర కిలో బంగారం, 10 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, 2 కంప్యూటర్ హార్డ్ డిస్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పండా అరెస్ట్‌పై పోలీసు కుటుంబాల హర్షం

పండా అరెస్ట్‌తో పలు పోలీసు కుటుంబాలు హ ర్షం వ్యక్తం చేశాయి. ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల భార్యలు  సంతోషం వ్యక్తంచేశారు. పండాకు మరణశిక్ష విధిస్తే తాను ఎంతో సంతోషిస్తానని వారిలో ఒకరు అన్నారు.పండాకు ఉరిశిక్ష వేయాలి.. లక్ష్మణానంద సరస్వతి, ఆయన నలుగురు సహచరుల హత్యకేసులో ప్రధాన నిందితుడైన పండాకు మరణశిక్ష వేయాల్సిందేనని సంఘ్‌పరివార్ సంస్థ అయిన స్వామి లక్ష్మణానంద సరస్వతి సమితి (ఎస్‌ఎల్‌ఎస్‌ఎస్) డిమాండ్ చేసింది. ఈ హత్యలు తానే చేసినట్టు పండా స్వయంగా ప్రకటనల ద్వారా, వీడియో టేపులద్వారా ప్రకటించుకున్నారని సమితి కార్యదర్శి లక్మికాంత్ దాస్ చెప్పారు. లక్ష్మణానంద సర స్వతి హత్యకు నిరసనగా ఒడిశాలోని కొంథమాల్ జిల్లాలోను ఇతర ప్రాంతాల్లోను జరిగిన అల్లర్లలో 38మంది మరణించారు.కాగా, తన  భర్త విప్లవకారుడని, ఒడిశా పోలీసులు చెబుతున్నట్టుగా హంతకుడు కానేకాదని పండా భార్య శుభశ్రీ పండా అలియాస్ మిలీ పండా అన్నారు.
 
 

మరిన్ని వార్తలు