భారీ చొరబాటు యత్నం భగ్నం

21 Oct, 2016 01:39 IST|Sakshi
భారీ చొరబాటు యత్నం భగ్నం

జమ్మూ: భారత్‌లో భారీ విధ్వంసానికి జరిగిన కుట్రను సరిహద్దు భద్రతా దళం భగ్నం చేసింది. పెద్ద సంఖ్యలో మందుగుండు సామగ్రి, రాకెట్లు, గ్రనేడ్లు తీసుకుని అంతర్జాతీయ సరిహద్దు గుండా కథువా జిల్లాలో చొరబాటుకు యత్నించిన ఆరుగురు మిలిటెంట్లను జవాన్లు అడ్డుకున్నారు. ‘బుధవారం రాత్రి 11.45 గంటల ప్రాంతంలో కథువా జిల్లాలో సరిహద్దు వద్ద వాహనంలో బీఎస్‌ఎఫ్ జవాన్లు గస్తీ కాస్తున్నారు.

ఈ సమయంలో కొందరు కంచె దాటేందుకు యత్నించటాన్ని గమనించిన జవాన్లు కాల్పులు జరిపారు. దీంతో ఆ ఆరుగురు పారిపోయారు. వారి వద్ద భారీగా రాకెట్ లాంచర్లు, గ్రనేడ్లున్నాయి. వీరికి మద్దతుగా సరిహద్దు సమీపంలోని పాక్ ఔట్‌పోస్టు నుంచి భారత జవాన్లపై కాల్పులు జరిగాయి. వీటిని సైనికులు తిప్పికొట్టారు’ అని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనను కొనసాగిస్తోంది.

మరిన్ని వార్తలు