ఆఫీస్‌ బాయ్‌కు రూ.కోట్లలో ఐటీ నోటీసులు

19 Dec, 2016 15:24 IST|Sakshi
ఆఫీస్‌ బాయ్‌కు రూ.కోట్లలో ఐటీ నోటీసులు

ముంబయి: ఓ కంపెనీలో ఆఫీసు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రవి జైశ్వాల్‌ (32) అనే వ్యక్తికి ఆదాయ పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అది కూడా రూ.5.4కోట్లు ట్యాక్స్‌ పెండింగ్‌ ఉందంటూ. అంతేకాదు.. అతడి పేరిట నాలుగు కంపెనీలు ఉన్నట్లు కూడా ఐటీ అధికారులు పంపించిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులు అందుకున్న రవి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఆ నోటీసులు తీసుకొని ఈ కేసుకు సంబంధించి విచారణ ప్రారంభిస్తున్న థానే ఎస్పీ మహేశ్‌ పాటిల్‌ వద్దకు వెళ్లి వివరాలు అందజేశాడు. ఆ సందర్భంలో వారిద్దరి మధ్య జరిగిన చర్చ ఆధారంగా అసలు విషయం బయటపడింది.

అతడి ఆధార్‌, పాన్‌ కార్డులు ఉపయోగించుకొని ఓ వ్యక్తి నాలుగు కంపెనీలు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని భయందర్‌ అనే ప్రాంతంలోని మురికి వాడల్లోగల గణేశ్‌ దేవల్‌ నగర్‌ కు చెందిన వాడు రవి. అతడు గతంలో కాండివ్లిలో చార్టెడ్‌ ఎకౌంటెంట్‌ రాజేశ్‌ అగర్వాల్‌ వద్ద 2008 ఆగస్టులో పనిలో చేరాడు. ఆ సమయంలో బ్యాంకు ఖాతాకోసం అంటూ తన పాన్‌, ఆధార్‌ కార్డులు తీసుకున్నాడు.

కానీ, జీతభత్యం మాత్రం డబ్బు రూపంలో చేతికే ఇచ్చాడు. 2012లో రవి అక్కడ పని మానేసి వేరే సంస్థలో చేరాడు. అంతకుమించి అతడికి ఏమీ తెలియదు. అతడు ఇచ్చిన ప్రకారం విచారణ చేపట్టిన పోలీసులు శనివారం అగర్వాల్‌(42), అతడి భాగస్వామి రాజీవ్‌ గుప్తా(30)ను మరో ఇద్దరు ఉద్యోగులను అరెస్టు చేశారు. అనంతరం వారిని థానే కోర్టుకు తీసుకెళ్లి అనంతరం జైలు కస్టడీకి తరలించారు.

మరిన్ని వార్తలు