కేంద్రమంత్రిని వెంటాడుతున్న కరోనా భయం..!

27 Apr, 2020 08:21 IST|Sakshi

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఓఎస్‌డీ సెక్యూరిటీకి కరోనా

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ భయాందోళనలు సృష్టిస్తోంది. ఏ వర్గాన్నీ వదలకుండా వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు వైద్యులు, పోలీసు అధికారులు వైరస్‌బారిన పడగా... తాజాగా కేంద్రమంత్రిని సైతం కరోనా భయం వెంటాడుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్థన్‌ ఓఎస్‌డీ (ఆఫీస్‌ ఆఫ్‌ స్పెషన్‌ డ్యూటీ) సెక్యూరిటీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అ‍య్యింది. దీంతో మంత్రి వ్యక్తిగత సిబ్బందిలో ఒక్కసారిగా వైరస్‌ కలకలం రేపింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్రమంత్రి ఓఎస్‌డీ వద్ద ఆఫీస్‌ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మంత్రి కార్యాలయ సిబ్బంది అతన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కి తరలించింది. ఈ క్రమంలోనే వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది.

ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి హర్షవర్థన్‌ ఓఎస్‌డీతో సహా, అతని కుటుంబం, సమీపంగా మెలిగిన వ్యక్తులను అధికారులు స్వీయ నిర్బంధం పాటించాలని ఆదేశించారు. మరోవైపు వీరిలో ఎవరైనా హర్షవర్థన్‌ను ప్రత్యక్షంగా కలిశారా అని అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిలో ఏమాత్రం అనుమానం ఉన్నా.. ముందు జాగ్రత్తగా కేంద్రమంత్రికి సైతం కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కాగా ఢిల్లీలో ఇప్పటివరకు 2625 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 54 మంది మ్యత్యువాత పడ్డారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికారులను మరింత అప్రమత్తం చేశారు. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు