కాలికి నూనె రాస్తే.. ప్రాణం పోయింది!!

2 May, 2017 11:17 IST|Sakshi
కాలికి నూనె రాస్తే.. ప్రాణం పోయింది!!

చావు రాసిపెట్టి ఉంటే.. అది ఏ రూపంలోనైనా రావచ్చు. ఢిల్లీలో 23 ఏళ్ల యువకుడికి అలాగే జరిగింది. కాలు నొప్పిగా ఉందని తల్లితో కాలికి నూనె రాయించుకుంటే.. కాసేపటికల్లా అతడు ప్రాణాలు కోల్పోయాడు! అతడు బ్యాడ్మింటన్ ఆడుతుండగా కాలి మడమకు గాయమైంది. దాంతో వైద్యుల వద్దకు వెళ్లగా అతడికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో కట్టు వేశారు. దానివల్ల అతడి కాలి నరాల్లో రక్తం గడ్డ కట్టింది. గాయం మానే సమయానికి ప్లాస్టర్ తీసేసినా.. ఆ గడ్డకట్టిన రక్తం కారణంగా కాలి వాపు, నొప్పి అలాగే ఉన్నాయి. దాంతో అతడి తల్లి కాలికి నూనె రాసి కొద్దిగా మర్దనా చేస్తే తగ్గుతుందని భావించి.. అలాగే చేశారు. కానీ, దానివల్ల గడ్డకట్టిన రక్తం ఊపిరితిత్తుల వరకు వెళ్లి, కొద్ది సేపటికే అతడు మరణించాడు. దాదాపు 5 సెంటీమీటర్ల వ్యాసం ఉన్న ఈ రక్తపు గడ్డ తొలుత కాలి నరంలోనే ఉండిపోయిందని, అయితే మసాజ్ కారణంగా అది ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే పల్మనరీ ఆర్టెరీ వరకు వెళ్లి అతడు అక్కడికక్కడే మరణించాడని పోస్టుమార్టం నివేదికలో వైద్యలు తెలిపారు.

ఇంటి దగ్గర స్పృహ తప్పి పడిపోగానే అతడిని ఎయిమ్స్‌కు తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. 'డీప్ వెయిన్ త్రాంబోసిస్' అనేది అరుదుగా సంభవిస్తుందని, అది ఒకోసారి ప్రాణాంతంకంగా మారుతుందని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా తెలిపారు. కాలికి వేసిన కట్టు తొలగించిన తర్వాత కూడా వాపు, నొప్పి ఉంటే మాత్రం తప్పనిసరిగా ఆర్థోపెడిక్ వైద్యులను సంప్రదించాలని, వాళ్లు అవసరమైతే వాస్క్యులర్ సర్జన్ వద్దకు పంపుతారని ఆయన చెప్పారు. లక్ష మందిలో సుమారు 70 మందికి ఈ సమస్య ఉంటుందని, ఎక్కువ సేపు కాళ్లు కదిలించకుండా ఉంచేయడం, సుదూర ప్రయాణాల లాంటి సందర్భాల్లో ఇది వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఎప్పుడైనా ఫ్రాక్చర్ల లాంటివి జరిగినప్పుడు అక్కడ మసాజ్ చేయకూడదని, కావాలంటే నూనె పోయడం లేడా వాపును అరికట్టే క్రీములు రాయడం లాంటివి చేయొచ్చు గానీ పొరపాటున కూడా ఒత్తిడి కలిగించకూడదని డాక్టర్ గుప్తా చెప్పారు. ఈ కేసు గురించి తాజాగా వెలువడిన మెడికో లీగల్ జర్నల్‌లో వివరించారు. వైద్యులు కూడా మసాజ్ చేయొద్దని సలహా ఇవ్వడం లేదని.. తప్పనిసరిగా ఇలాంటి సూచనలు, సలహాలు ఇవ్వాలని అన్నారు.

మరిన్ని వార్తలు