కర్ణాటక ఎఫెక్ట్‌.. ‘పెట్రో’ పెంపునకు బ్రేక్‌

2 May, 2018 01:38 IST|Sakshi

న్యూఢిల్లీ: వారం రోజుల క్రితం వరకూ పెట్రో ధరల్ని ఇష్టానుసారం పెంచిన ఆయిల్‌ కంపెనీలు, కర్ణాటక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఒక్కసారిగా ధరల పెంపునకు బ్రేక్‌ వేశాయి. ఏప్రిల్‌ 24 నుంచి ఇప్పటి వరకూ అంతర్జాతీయంగా బ్యారెల్‌ ముడిచమురు ధర 2 డాలర్లు పెరిగినా.. పెట్రోలు, డీజిల్‌ ధరల్లో మార్పు చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఏప్రిల్‌ 24న అంతర్జాతీయంగా బ్యారెల్‌ ముడిచమురు ధర 78.84 డాలర్లుగా ఉండగా.. ప్రస్తుతం అది 80.56 అయ్యింది.

గతవారం పెట్రో ధరలు దాదాపు ఐదేళ్ల గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ. 74.63, డీజిల్‌ ధర రూ. 65.93కు చేరడంతో పెట్రో వాత నుంచి సామాన్యుడికి ఊరట కోసం ఎక్సైజ్‌ పన్నును తగ్గించాలని డిమాండ్లు వెల్లువెత్తినా కేంద్ర ఆర్థిక శాఖ మాత్రం ఒప్పుకోలేదు.ధరల్లో మార్పులు చేయకపోవడానికి కారణాలపై ఆయిల్‌ కంపెనీ అధికారుల్ని సంప్రదించగా..  మాట్లాడేందుకు వారు నిరాకరించారు. ఈ అంశంపై మాట్లాడవద్దని తమకు ఆదేశాలు ఉన్నాయని చెప్పారు.

మీ ప్రయోజనాలే ముఖ్యమా?: చిదంబరం
పెట్రోల్, డీజిల్‌పై పన్ను భారంతో ప్రజల్ని ఇబ్బందిపెడితే.. చివరకు అది ప్రజలు, ప్రభుత్వం మధ్య విభేదాలకు దారితీస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం హెచ్చరించారు. ‘పెట్రోల్, డీజిల్‌పై ఒక్క రూపాయి పన్ను తగ్గిస్తే రూ. 13 వేల కోట్ల నష్టం వస్తుందని ప్రభుత్వం చెపుతోంది.

అయితే పెట్రోల్, డీజిల్‌ ఒక్క రూపాయి పన్ను పెంచితే తమపై రూ. 13 వేల కోట్ల పన్ను భారం పడుతుందని ప్రజలు చెపుతున్నారు. ఎవరి ఆసక్తులు ముఖ్యం? ప్రభుత్వ ప్రయోజనాలా.. లేదా ప్రజల సంక్షేమమా?’ అని ట్వీటర్‌లో ఆయన ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు