ఉపాధి హామీకి ఓకే..

1 Mar, 2015 02:53 IST|Sakshi
ఉపాధి హామీకి ఓకే..

2015-16 బడ్జెట్ కేటాయింపు రూ. 34,699 కోట్లు(12 శాతం పెంపు)
2014-15 బడ్జెట్ కేటాయింపు రూ. 31,000 కోట్లు(సవరించిన అంచనా)
2013-14 బడ్జెట్ కేటాయింపురూ. 33,000 కోట్లు
 
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు కచ్చితంగా ఉపాధి భద్రతను కల్పించడం ఈ పథకం ఉద్దేశం. 2005లో దీనికోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) కార్యరూపం దాల్చింది. 2006 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకాన్ని 2008 నాటికి దేశంలోని అన్ని జిల్లాలకూ విస్తరించారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఫ్లాగ్‌షిప్ పథకాల్లో కీలకంగా నిలిచిన ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. అయితే, భారీగా నిధులను వెచ్చిస్తున్నప్పటికీ వనరుల కల్పనలో పెద్దగా ప్రభావం చూపడం లేదన్నది ప్రధాన విమర్శ.

అయితే, మోదీ సర్కారు దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల పెంపు, ఆర్థికాభివృద్ధికి జత చేస్తామని చెబుతోంది.  క్రీడా ప్రాంగణాలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం వంటివి కూడా ఈ పథకంలోకి చేర్చింది. సబ్సిడీలకు ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ)ని అమలు చేసేందుకు ఎంపిక చేసిన 51 జిల్లాలకు గాను 46 జిల్లాల్లో ఉపాధి హామీ వేతనాల చెల్లింపును ఆధార్ కార్డులతో లింక్ చేశారు.

అనుకున్న విధంగా ఖజానాకు నిధులు సమకూరితే మరో రూ.5,000 కోట్లను అదనంగా కేటాయిస్తామని కూడా జైట్లీ ప్రకటించారు. గ్రామీణ పేదల్లో ఏ ఒక్కరూ ఉపాధి లేకుండా ఉండకూడదన్నదే తమ ధ్యేయమని చెప్పారు. యూపీఏ పథకాలను మోదీ సర్కారు నీరుగారుస్తుందన్న విమర్శలను, ముఖ్యంగా ఈ పథకాన్ని నిలిపేస్తారన్న ఊహాగానాలను పక్కకునెడుతూ ఉపాధి హామీకి దండిగా నిధులను కేటాయించడం చెప్పుకోదగ్గ విషయం.

మరిన్ని వార్తలు