‘చచ్చిపో కానీ ఇల్లు వదిలేయ్‌’

8 Jul, 2019 16:41 IST|Sakshi
ఇంద్రజిత్‌, పుష్ప గ్రోవర్‌

ఘజియాబాద్‌: వయసు పైబడ్డ తల్లిదండ్రలను కన్నవాళ్లు నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి వెళ్లగొడుతున్న ఘటనలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. రక్తం పంచుకు పుట్టిన కొడుకే.. ‘మీరు చచ్చినా సరే, కానీ ఇంటి నుంచి వెళ్లిపోండంటూ​’ వేధిస్తున్నాడని ఓ వృద్ధ జంట సోషల్‌ మీడియాలో గోడు వెళ్లబోసుకుంది. ‘అయినవాళ్లే మమ్మల్ని కాదనుకుంటే ఎవరు దిక్కు. మాకు ఆత్మహత్యే శరణ్యం’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు దంపతులు.

వివరాల్లోకి వెళితే.. ఎంఎం రోడ్డులోని అంకుర్‌ విహార్‌లో ఉంటున్న ఇంద్రజిత్‌, పుష్ప గ్రోవర్‌ దంపతులకు కొడుకు, కుమార్తె ఉన్నారు. కూతురు ఆస్ట్రేలియాలో నివసిస్తోంది. ఇంద్రజిత్‌ దంపతులు కొడుకు కోడలు దగ్గరే నివాసముంటున్నారు. ఆయన హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా భార్య కీళ్ల వ్యాధితో సతమతమవుతోంది. ఈ సమయంలో అండగా నిలవాల్సిన కొడుకు అభిషేక్‌, తన భార్యతో కలిసి తల్లిదండ్రులను ఇల్లు విడిచి వెళ్లాలంటూ నిత్యం నరకం చూపిస్తున్నాడు. చేసేది లేక తన బాధను సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ వీడియో ద్వారా వేడుకున్నాడు.

ఈ వీడియో కొద్ది గంటల్లోనే వైరల్‌ కావడంతో జిల్లా యంత్రాంగం స్పందించింది. ఆదివారం ఉదయం 8 గంటలకు జిల్లా మేజిస్ట్రేట్‌ స్వయంగా ఇంద్రజిత్‌ ఇంటికి చేరుకుని చర్చలు జరిపారు. ఇంద్రజిత్‌ ఇంటిపై కుమారుడికి ఎటువంటి హక్కు లేదని అధికారులు స్పష్టం చేశారు. చేసేదేం లేక అభిషేక్‌, తన భార్యతో సహా బయటకు వెళ్లడానికే నిశ్చయించుకున్నాడు. తండ్రి కోరిక మేరకు మరో పది రోజుల్లో తన కుటుంబంతో సహా ఇల్లు వదిలి వెళ్లిపోతానంటూ లిఖితపూర్వకంగా తెలిపాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిపిన చర్చలు సఫలమయ్యాయని జిల్లా మెజిస్ట్రేట్‌ అధికారి ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు