కోవిడ్‌-19 : కోలుకున్న శతాధిక వృద్ధుడు

5 Jul, 2020 19:43 IST|Sakshi

మహమ్మారిని జయించాడు

సాక్షి, న్యూఢిల్లీ : వందేళ్ల కిందట ప్రపంచాన్ని కబళించిన స్పానిష్‌ ఫ్లూను తట్టుకున్న వ్యక్తి తాజాగా కోవిడ్‌-19 బారినపడి 106 ఏళ్ల వయసులోనూ సులువుగా కోలుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని కోవిడ్‌-19 కేంద్రంలో చికిత్స పొందుతూ 70 ఏళ్ల తన కుమారుడి కంటే ఆయన వేగంగా కోలుకున్నారు. రాజీవ్‌ గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి తన భార్య, కమారుడు, మరో కుటుంబ సభ్యుడితో కలిసి ఆయన ఇటీవలే డిశ్చార్జి అయ్యారని వైద్యులు తెలిపారు. 1918లో ఇప్పటి కోవిడ్‌-19 తరహాలోనే ప్రపంచాన్ని వణికించిన స్పానిష్‌ ఫ్లూ ప్రభావాన్ని ఆ‍యన ఎదుర్కొన్నారని వైద్యులు చెప్పారు. ఈ తరహా కేసు ఢిల్లీలో ఇదే మొదటిది కావచ్చని వైద్యులు పేర్కొన్నారు.

డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం 1918లో వ్యాప్తి చెందిన స్పానిష్‌ ఫ్లూతో ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది మరణించారు. అయితే ఆయనకు స్పానిష్‌ ఫ్లూ సోకిందో లేదో తమకు తెలియదని, ఢిల్లీలో అప్పట్లో చాలా తక్కువ ఆస్పత్రులే ఉండేవని..అప్పటి రికార్డులు లభ్యం కానందున ఈ విషయం నిర్ధారించలేమని వైద్యులు చెబుతున్నారు. ఏమైనా 106 సంవత్సరాల శతాధిక వృద్ధుడు కరోనా వైరస్‌ నుంచి వేగంగా కోలుకోవడం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. మహమ్మారి నుంచి బయటపడేందుకు ఆయన చూపిన సంకల్ప బలం అమోఘమని వైద్యులు కొనియాడారు. రెండు అత్యంత ప్రమాదకర వైరస్‌లను ఆయన దాటివచ్చారని గుర్తుచేశారు. చదవండి: కరోనాతో మాజీ ఎమ్మెల్యే మృతి

>
మరిన్ని వార్తలు