పండుటాకుల ఘోష పట్టదా!

16 Aug, 2013 01:01 IST|Sakshi
పండుటాకుల ఘోష పట్టదా!

‘‘జీవితపు తొలి అడుగులు వేస్తున్న పిల్లలు, మలిసంధ్యలో ఉన్న వృద్ధులు, రోగగ్రస్తులు, వికలాంగులతో వ్యవహరించే తీరు ఆయా ప్రభుత్వాల నైతికతకు తార్కాణాలు. అయితే ఇప్పుడిది గతకాలపు మాటగా మాత్రమే మిగిలిపోయింది’’
 - అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు హ్యుబెర్ట్ హంఫ్రీ
 
 వయసుకు మర్యాద ఇవ్వడం మన సంస్కృతి. కానీ భారత్‌లో ఇప్పుడేం జరుగుతోంది? ఉన్న పదికోట్ల మంది వృద్ధుల్లో (అరవై ఏళ్లు పైబడినవారు) 66 శాతం మంది పస్తులతో ఉంటున్నారు. 37 శాతం మంది ఒంటరితనానికి, నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు నిత్యం మానసిక, శారీరక హింసకు లోనవుతున్నారు. ఎంత దారుణం? అందుకే జీవితాన్ని కాచివడబోసిన వీరిప్పుడు తమ హక్కుల కోసం గొంతెత్తుతున్నారు. ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. తమ గోడు పట్టదా అని శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనకు దిగనున్నారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్‌కు చెందిన సెంటర్ ఫర్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ వీరికి బాసటగా నిలుస్తోంది.
 
 చట్టుబండలైన చట్టాలు
 దేశంలో వయోవృద్ధుల సంక్షేమం కోసం చట్టాలు ఉండనే ఉన్నాయి. ఆకలి, వ్యాధులు, పేదరికం, నిర్లక్ష్యం, అభద్రత భావాల నుంచి సీనియర్ సిటిజన్లను రక్షించే ఉద్దేశంతో కేంద్రం 1999లో ‘నేషనల్ పాలసీ ఆన్ ఓల్డర్ పర్సన్స్’ (ఎన్‌పీఓపీ), 2007లో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ (ఎండబ్ల్యూపీఎస్‌సీఏ), అదే ఏడాది ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ పేరుతో మూడు చట్టాలను తెచ్చింది. భారతీయ రాజ్యాంగం తన ఆదేశ సూత్రాల ద్వారా వయో వృద్ధులకు కల్పిస్తున్న హక్కులు అమలు చేసేందుకు ఈ చట్టాలు ఉపయోగపడతాయని కేంద్రం భావించింది. అయితే వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాలను అసలు పట్టించుకోకపోగా, కొన్ని నామమాత్రంగా అమలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నాయి.
 
 మూడేళ్లుగా నిరసనోద్యమాలు
 తమకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించేందుకు దేశంలోని వయోవృద్ధులు ‘ఆలిండియా సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్’ నేతృత్వంలో మూడేళ్లుగా నిరసిస్తూనే ఉన్నారు. గతేడాది, ఈ ఏడాది ఆగస్టు ఒకటవ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ముంబైతోపాటు అనేకచోట్ల ప్రదర్శనలు నిర్వహించారు.
 
 డిమాండ్లు ఏమిటి?
 ఇప్పటికే చేసిన చట్టాలను పటిష్టంగా అమలు చేయడం ప్రధాన డిమాండ్ కాగా, సీనియర్ సిటిజన్స్ కోసం కేంద్రం ప్రత్యేకంగా ఒక విధానాన్ని రూపొందించి అమలు చేయాలని అఖిల భారత సీనియర్ సిటిజెన్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు డాక్టర్ కింజావాడేకర్ కోరుతున్నారు. వీటితోపాటు వయోవృద్ధుల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి కోసం ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా ఆరోగ్యశ్రీ వంటి ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని, వృద్ధాప్య పింఛన్లను రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వృద్ధుల ఆర్థిక భద్రత కోసం ప్రత్యేక సేవింగ్స్ పథకాన్ని తీసుకురావాలని, ఆదాయపన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. యాభై ఎనిమిదేళ్లు పైబడ్డ మహిళలకు ఇస్తున్నట్లే తమకు కూడా రైల్వే ప్రయాణాల్లో 50 శాతం రాయితీ కల్పించాలని, వృద్ధుల ఆదాయంపై వసూలు చేసే పన్ను (టీడీఎస్)కు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
 - సాక్షి, హైదరాబాద్

>
మరిన్ని వార్తలు