ముంబై తీరానికి ఆత్మీయ అతిథి!

24 Mar, 2018 02:36 IST|Sakshi

వెర్సోవా బీచ్‌లో 20 ఏళ్ల తర్వాత ఆలివ్‌ రిడ్లీ తాబేళ్లు 

సాక్షి, ముంబై: ఒక విశిష్ట అతిథి రాక రాక వచ్చింది. దేశదేశాలు దాటుకుంటూ, అలుపుసొలుపు లేకుండా సుదీర్ఘంగా ప్రయాణం చేస్తూ వచ్చింది. ముంబై తీరంలో సందడిని, పర్యావరణవేత్తల్లో సంబరాన్ని ఒకేసారి మోసుకువచ్చింది. ఆ ఆత్మీయ అతిథి కోసం పర్యావరణవేత్తలు  20 ఏళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఆ అరుదైన జాతిని ముంబై బీచ్‌లలో చూడగలమో లేదోనని కొన్నాళ్లు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించింది. అత్యంత అరుదైన జాతికి చెందిన ఆలివ్‌ రిడ్లీ తాబేళ్లు ముంబై వెర్సోవా బీచ్‌లో మెరిశాయి.

మొత్తం 80 గుడ్లు ఈ తీరంలో మార్నింగ్‌ వాకర్లకి, బీచ్‌ని శుభ్రం చేసే కార్మికులకు కనిపించాయి. అయితే అవి నిజంగా ఆలివ్‌ రిడ్లీ తాబేళ్ల గుడ్లేనా అన్న అనుమానాలను కొందరు పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు  వ్యక్తం చేశారు.  సంతానాభివృద్ధి కోసం ఈ అరుదైన జాతి ముంబై తీరానికి వచ్చిందో లేదో నిర్ధారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. వారి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వ అటవీశాఖ అధికారి ప్రశాంత్‌ దేశ్‌ముఖ్‌ నేతృత్వంలోని ఒక బృందం వెర్సోవా బీచ్‌ను సందర్శించింది.

ఆలివ్‌ రిడ్లీ తాబేళ్లు తమకు సురక్షితమని భావించే సముద్ర తీర ప్రాంతాల్లో ఇసుకను తవ్వి ఆ గోతుల్లో గుడ్లను పెడతాయి. అలాంటి గోతులు, వాటిల్లో కొన్ని విరిగిపోయిన గుడ్లు వెర్సోవా బీచ్‌లో రాష్ట్ర ప్రభుత్వం బృందానికి కనిపించాయి. కొన్ని గుడ్ల నుంచి మృతి చెందిన తాబేలు పిల్లలు కూడా కనిపించాయి. వాటిని పరీక్షించగా అవి అరుదైన ఆలివ్‌ రిడ్లీ జాతికి చెందినవేనని తేలింది. ‘ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఇది నిజంగా శుభవార్త. వెర్సోవా బీచ్‌ కూడా ఆలివ్‌ రిడ్లీ తాబేళ్లు గుడ్లు పొదగడానికి అనువైన ప్రాంతంగా మారింది. జీవవైవిధ్యాన్ని కోరుకునేవారిలో స్ఫూర్తిని నింపే పరిణామం ఇది.

ఇదే బీచ్‌లో మరిన్ని ఎగ్‌ షెల్స్‌ ఉండే అవకాశం ఉంది. ‘ అని అటవీ సంరక్షణ శాఖ అధికారి వాసుదేవన్‌ చెప్పారు. అరుదైన తాబేళ్లు కనిపించగానే సంబరాలు చేసుకోనక్కర్లేదు.  ఇప్పుడు వాటిని కాపాడుకోవమే చాలా ప్రయాసతో కూడుకున్న పని. కుక్కలు, మత్స్యకారుల మరబోట్లు, బీచ్‌ సందర్శకుల నుంచి వాటికి ముప్పు పొంచి ఉంది. తాబేళ్ల గుడ్లను సంరక్షించి అరుదైన జాతిని కాపాడుకోవడమే అటవీ శాఖ అధికారుల ముందున్న పెద్ద సవాల్‌ అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

మరిన్ని వార్తలు