ముస్లిం మంత్రుల పేర్లు మార్చగలరా..?

10 Nov, 2018 15:57 IST|Sakshi

లక్నో : దేశవ్యాప్తంగా చారిత్రక నగరాల పేర్లను మార్చే సంప్రాదాయం ప్రారంభమయ్యింది. కొందరు దీన్ని స్వాగతిస్తుండగా.. ఎక్కువ మంది మాత్రం ఈ విషయం గురించి విమర్శలు చేస్తోన్నారు. ఈ క్రమంలో ముస్లిం పాలకుల పేర్ల మీద ఉన్న చారిత్రక నగరాల పేర్లు మారుస్తున్న బీజేపీ నాయకులు.. వారి పార్టీలో ఉన్న ముస్లిం ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు కూడా మారుస్తారా అంటూ బీజేపీ పార్టీ మిత్రుడు.. యోగి ఆదిత్యనాథ్‌ క్యాబినేట్‌లో మంత్రిగా పనిచేస్తోన్న ఓమ్‌ ప్రకాశ్‌ రాజ్భర్‌ సవాలు చేశారు. కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అలహాబాద్‌ పేరును ప్రయాగ్‌రాజ్‌గా, ఫైజాబాద్‌ పేరును శ్రీ అయోధ్యగా మార్చిన సంగతి తెలిసిందే. ఇవేకాక అహ్మదాబాద్‌, ఔరంగబాద్‌, హైదరాబాద్‌, అగ్రా పేర్లను మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా ఓమ్‌ ప్రకాశ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు అంశాల గురించి ప్రశ్నించారు. మొఘలుల పేర్లతో ఉన్నాయని చెప్పి మొఘల్‌సరాయి, ఫైజాబాద్‌ పేర్లను మార్చారు. మరి జాతీయస్థాయిలో ఉన్న కేంద్ర మంత్రులు, యూపీ మంత్రులైన షహ్నవాజ్‌ హుస్సెన్‌, ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ, మొహ్సిన్ రాజాల వంటి ముస్లిం నాయకుల పేర్లను కూడా మార‍్చగలరా అంటూ సవాల్‌ విసిరారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడకుండా ఉండటానికి.. వారి దృష్టి మరల్చడానికే బీజేపీ ఇలాంటి డ్రామాకు తెరలేపిందంటూ విరుచుకుపడ్డారు. ముస్లింలు మన కోసం కొన్ని మహోన్నతమైన వాటిని వదిలి వెళ్లారు. ఎర్రకోట, తాజ్‌మహల్‌ను నిర్మించిందేవరు? అంటూ ఆయన ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు