‘మళ్లీ డిటెన్షన్‌..! ఇదంతా పక్కా ప్లాన్‌’

10 Feb, 2020 14:55 IST|Sakshi

న్యూఢిల్లీ : మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాను మరోసారి నిర్బంధంలోకి తీసుకోవడంపై ఆయన సోదరి సారా అబ్దుల్లా పైలట్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన సోదరుడి భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని, ఆయన్ను వెంటనే కోర్టులో ప్రవేశ పెట్టేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు. సరైన కారణాలు లేకుండా ఇప్పటికే ఓసారి డిటెన్షన్‌లో పెట్టారని, మళ్లీ నిర్బంధించి వారి హక్కులను కేంద్రం పెద్దలు కాలరాస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థుల నోళ్లు నొక్కడానికి పక్కా ప్లాన్‌తో ఇదంతా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
(చదవండి : ఒమర్‌ ప్రజలను ప్రభావితం చేస్తారు)

కాగా, జమ్మూకశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్లు గత ఏడాది ఆగస్టు 5వ తేదీన ప్రకటించిన కేంద్రం.. ఒమర్ అబ్దుల్లా, మెహబూబాలతోపాటు మరికొందరు నేతలను  నిర్బంధించడంతోపాటు ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే, డిటెన్షన్‌ గడువు (ఆరు నెలలు) ముగియడానికి కొన్ని గంటల ముందు  (ఈ నెల 6వ తేదీన) వీరిద్దరితో పాటు ‍మరికొందరినీ ప్రజా భద్రతా చట్టం (పీఎస్‌ఏ) కింద నిర్బంధంలోకి తీసుకున్నారు.

వీరితో పాటు శ్రీనగర్‌లో మంచి పట్టున్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అలీ మొహమ్మద్‌ సగర్‌పై, పీడీపీ కీలక నేత సర్తాజ్‌ మదానీపై కూడా పీఎస్‌ఏ కింద నోటీసులు జారీ చేశారు. మదానీ మెహబూబా ముఫ్తీకి మామ అవుతారు. పీఎస్‌ఏలోని ‘పబ్లిక్‌ ఆర్డర్‌’ సెక్షన్‌ ప్రకారం విచారణ లేకుండా ఆరు నెలలు, ‘రాజ్య భద్రతకు ప్రమాదం’ అనే సెక్షన్‌ ప్రకారం విచారణ లేకుండా రెండు సంవత్సరాల వరకు అనుమానితులను నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ చట్టం ఒమర్‌ అబ్దుల్లా తాత షేక్‌ అబ్దుల్లా హయాంలో 1978లో రూపొందింది. ముఖ్యంగా కలప స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు