కిలో ఉల్లిపాయలు ఫ్రీ, కానీ..

9 Dec, 2019 18:30 IST|Sakshi
కిలో ఉల్లిపాయ ఉచితంగా ఇస్తున్న షాపు యజమాని

నాలుకకు రుచి తగలాలంటే ఆ వంటలో ఉల్లిపాయ ఉండాల్సిందే. కానీ ఉల్లిపాయ రేట్లు కొండెక్కి కూర్చోవడంతో వంటల్లో వాటిని బ్యాన్‌ చేశారు. దీంతో ఉల్లి లేని వంటలు తినలేక భోజనప్రియులు బిక్కమొహం వేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఉల్లిపాయ మ్యూజియంలో వస్తువులా మారిపోయినట్టు కనిపిస్తోంది. ఉల్లిపాయ రేట్లు చూసి సామాన్య జనం కళ్లు తేలేస్తున్నారు. కొనకముందే ఏడ్పించేస్తున్న ఉల్లిపాయలను కొంతమంది బాగానే క్యాష్‌ చేసుకుంటున్నారు.

అదెలాగంటే.. తమిళనాడులోని పట్టుకొట్టై ప్రాంతంలో ఉన్న ఎస్‌టీఆర్‌ మొబైల్స్‌ దుకాణం వినియోగదారులకు ఉచితంగా కిలో ఉల్లిపాయలు ఇస్తోంది. కానీ ఇక్కడో చిన్న మెలిక ఉంది. మీకు ఉల్లిపాయలు కావాలంటే ముందుగా ఆ దుకాణంలో ఓ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో స్మార్ట్‌ఫోన్‌కు ఒక కేజీ ఉల్లి ఉచితం. ఈ ఐడియా బాగానే వర్కవుట్‌ అయినట్లు కనిపిస్తోంది. కేజీ ఉల్లిపాయ ఆఫర్‌తో జనాలు మొబైల్‌ షాపు ముందు క్యూ కడుతున్నారని దుకాణ యజమాని శరవనకుమార్‌ చెప్పుకొచ్చాడు.

ఈ ఆఫర్‌తో షాపుకు వినియోగదారుల తాకిడి పెరిగిందన్నారు. ‘సాధారణ రోజుల్లో రోజుకు మూడు, నాలుగు మాత్రమే ఫోన్లు అమ్మేవాడిని. కానీ ఈ ఆఫర్‌ తర్వాత 10 అంతకు పైనే స్మార్ట్‌ఫోన్లు అమ్ముడవుతున్నాయి’ అని చెప్పాడు. ఇక షాపుకు వచ్చినవాళ్లు స్వయంగా వారే ఉల్లిపాయలను ఏరుకుని మరీ తీసుకెళ్లవచ్చట. కాగా తమిళనాడులో ఓ జంట వివాహానికి హాజరైన అతిథులు బకెట్‌ ఉల్లిపాయలు గిఫ్ట్‌గా ఇచ్చి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. (చదవండి: ఈజిప్టు ఉల్లి..రావే తల్లీ..!)

>
మరిన్ని వార్తలు