అట్టుడుకుతున్న కశ్మీర్

16 Apr, 2016 01:44 IST|Sakshi
అట్టుడుకుతున్న కశ్మీర్

భద్రతా బలగాల కాల్పుల్లో ఒకరి మృతి
♦ ఐదుకు చేరిన మృతుల సంఖ్య
♦ కుప్వారా నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించిన ఆందోళనలు
♦ బలగాలపై రాళ్లు విసురుతున్న నిరసనకారులు
 
 శ్రీనగర్: వరుస ఆందోళనలతో కశ్మీర్ అట్టుడుకుతోంది. శుక్రవారం కుప్వారాలో ఆందోళనకారులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపిన ఘటనలో ఒకరు మృతిచెందారు. కశ్మీర్ లోయలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో 40 మంది భద్రతాబలగాలు సహా మొత్తం 47 మంది గాయపడ్డారు. నాలుగు రోజుల క్రితం కుప్వారా కేంద్రంగా మొదలైన ఆందోళనలు ఇతర ప్రాంతాలకూ విస్తరించాయి. దీంతో కశ్మీర్‌లోయలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. హంద్వారాలో భద్రతా బలగాలు బాలికను లైంగికంగా వేధిస్తున్నాయంటూ స్థానికులు ఆందోళన చేస్తుండడం తెలిసిందే. దీనిపై సీం మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ‘మరొకరు మరణించడం కలచివేసింది.

అసాంఘిక శక్తులు రాష్ట్రంలో అశాంతి రేకెత్తించాలనుకుంటున్నాయి. వీటి ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలి’ అని ప్రజలను కోరారు.  శుక్రవారం కుప్వారాలోని నత్నూసాలో ఆర్మీ క్యాంపుపై నిరసనకారులు రాళ్లు విసరగా, వారిని చెదరగొట్టేందుకు బలగాలు కాల్పులు జరిపాయని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో అరిఫ్ హుసేన్ అనే 18 ఏళ్ల యువకుడు మృతిచెందగా, మరో ముగ్గురికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఆందోళనకారులు సైనికశిబిరాన్ని చుట్టుముట్టడానికి ప్రయత్నించారని, నిరసనకారులు బలగాలపై రాళ్లు విసిరేశారని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో తప్పని పరిస్థితిలో బలగాలు కాల్పులు జరిపాయన్నారు. బారాముల్లా జిల్లాలోని సొపోర్, పుల్వామా జిల్లాలోని త్రాల్, అనంతనాగ్ జిల్లాలోని బిజ్బెహరా, గందెర్బాల్ జిల్లాలోని శ్రీనగర్ సిటీ, కంగన్ ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. కుప్వారా జిల్లాలోని జల్‌చల్ద్రా, క్రల్‌గుండ్ తదితరాలు హింసకు నిలయంగా మారాయి. ఆందోళనకారులు రాళ్లు విసరగా, వారిని నియంత్రించడానికి భద్రతా బలగాలు బాష్పవాయువు ప్రయోగించాయి. ఘర్షణల్లో 40 మంది భద్రతా సిబ్బంది గాయపడినట్లు పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు.

 శనివారం బంద్.. పౌరుల మృతిని నిరసిస్తూ వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్ అధినేత మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ శ్రీనగర్‌లో ఆందోళనకు ఉపక్రమించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అతివాద హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీని, జేకేఎల్‌ఎఫ్ చీఫ్ మొహమ్మద్ యాసిన్ మాలిక్‌లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హురియత్ కాన్ఫరెన్స్‌తోపాటు ఇతర వేర్పాటువాద సంస్థలు శనివారం బంద్‌కు పిలుపునిచ్చాయి. శనివారం నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కశ్మీర్ యూనివర్సిటీ వాయిదా వేసింది. పీడీపీ-బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హింస పెచ్చుమీరిందని కాంగ్రెస్ దుయ్యబట్టింది. దీనిపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరింది.

మరిన్ని వార్తలు