జిన్నా ఫొటోను కాల్చినా, చించినా లక్ష నజరానా

6 May, 2018 17:07 IST|Sakshi

అలీగఢ్‌ : మహమ్మద్‌ అలీ జిన్నా చిత్రపట వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలో ఉన్న జిన్నా చిత్రపటాన్ని వెంటనే తొలగించాలని ఆల్‌ ఇండియా ముస్లిం మహాసంఘ్‌ అధ్యక్షుడు ఫర్హత్‌ అలీఖాన్‌ డిమాండ్‌ చేశారు. దేశంలో ఎక్కడైనా జిన్నా ఫొటోలను కాల్చినా, చించినా వారికి ఏకంగా రూ. లక్ష బహుమతిగా అందిస్తానని ప్రకటించారు. దేశాన్ని పాకిస్తాన్‌, హిందూస్తాన్‌గా విడగొట్టిన వ్యక్తి ఫొటోలను ఎందుకు ఉంచుకోవాలని అన్నారు. పాకిస్తాన్‌లో ఏ ప్రభుత్వ కార్యాలయంలోగాని, యూనివర్సిటీల్లోగాని అఖండ భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన మన నాయకులు గాంధీ, నెహ్రుల చిత్రపటాలను ఉంచారా అని ప్రశ్నించారు.

అలాంటప్పుడు మనం ఎందుకు జిన్నా చిత్రపటాన్ని ఉంచాలని అన్నారు. దేశంలోని అందరూ జిన్నా ఫొటోను కాల్చినా, చించినా వారికి రూ.లక్ష నగదు పురస్కారం అందిస్తామని వెల్లడించారు. అయితే ఈ వివాదాన్ని మొదట బీజేపీ ఎంపీ సతీష్‌ గౌతమ్‌ లేవనెత్తిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీలోని సూడెంట్స్‌ యూనియన్‌ హాల్‌లో జిన్నా ఫొటోను తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీంతో కొంతమంది బీజేపీ కార్యకర్తలు యూనివర్సిటీ ముందు ధర్నాలు కూడా నిర్వహించారు. దీనిపై యూనివర్సిటీ వీసీ వివరణ ఇస్తూ.. యూనివర్సిటీ స్థాపనకు నిధులు దానం చేసిన వారిలో జిన్నా ఒకరని, అందుకే ఆయన చిత్రపటాన్ని ఉంచామని, ఆయనతోపాటు గాంధీ, నెహ్రు లాంటి మహా నాయకుల చిత్రపటాలను కూడా ఉన్నాయని తెలిపారు. 

మరిన్ని వార్తలు