ఒక్క చోటే పోటీకి అవకాశం!

13 Mar, 2015 02:56 IST|Sakshi

 న్యూఢిల్లీ: ఎన్నికల్లో అభ్యర్థులు కేవలం ఒక్క చోట మాత్రమే పోటీ చేసేందుకు అవకాశముండాలని న్యాయ కమిషన్ సిఫారసు చేసింది. అంతేగాకుండా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయకుండా నిబంధనలు ఉండాలని ప్రతిపాదించింది. దాంతోపాటు ‘పెయిడ్ న్యూస్’పైనా కఠినంగా వ్యవహరించాలని.. వార్తలకు చెల్లించడంతో పాటు తీసుకోవడాన్నీ నేరంగా పరిగణించాలని సూచించింది. ఎన్నికల సంస్కరణలపై తమ ప్రతిపాదనలతో కూడిన రెండో నివేదికను న్యాయ కమిషన్ గురువారం సమర్పించింది. కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ ఎ.పి. షా దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
 న్యాయ కమిషన్ సూచనలు..   

చెల్లింపు వార్తల (పెయిడ్ న్యూస్)పై కఠినంగా వ్యవహరించాలి. వార్తల కోసం డబ్బు ఇవ్వడంతో పాటు తీసుకోవడాన్ని కూడా ప్రజాప్రాతినిధ్య చట్టం కింద చేర్చి.. కఠిన శిక్షలను విధించాలి. వార్తల కోసం సొమ్ము చెల్లించే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలి.

ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి ఒక కొలీజియం ఏర్పాటు చేసి, దాని ద్వారానే భర్తీ చేయాలి.
   లోక్‌సభ, శాసనసభల కాలపరిమితి ముగియడానికి ఆరు నెలల ముందు నుంచే ప్రభుత్వ ప్రకటనలపై కఠినమైన నియంత్రణ, నిషేధం విధించాలి.
   ఎన్నికల వ్యయం లెక్కలను సమర్పించని అభ్యర్థులపై విధిస్తున్న నిషేధాన్ని మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచాలి. తద్వారా తర్వాతి  ఎన్నికల్లో వారు పోటీ చేసేందుకు అవకాశం ఉండదు.
  రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యయం లెక్కలు సమర్పించకపోతే.. పన్ను ప్రయోజనాలను తొలగించడంతో పాటు జరిమానాలు కూడా విధించాలి. రోజుకు రూ. 25 వేల జరిమానాతో పాటు 90 రోజుల పాటు అలాగే ఉంటే పార్టీల గుర్తింపును రద్దుచేయాలి.
 ఎన్నికల వ్యయానికి సంబంధించి ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ వేసిన నాటి నుంచి ఫలితాల విడుదల తేదీ వరకు లెక్కిస్తున్నారు... ఈ వ్యయ లెక్కింపు గడువును ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఫలితాల వెల్లడి తేదీ వరకు పెంచాలి.

    వివిధ కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే నిర్ణయాన్ని... ఆయా కంపెనీల డెరైక్టర్ల బోర్డులో కాకుండా, ఏటా జరిగే సభ్యులందరి సాధారణ సమావేశంలో తీర్మానం ద్వారా తీసుకొనేలా కంపెనీల చట్టాన్ని సవరించాలి.
 దేశంలో ప్రస్తుతమున్న లోక్‌సభ సీట్ల సంఖ్యను మరింత పెంచాలి.
   హైకోర్టుల్లో ఎన్నికల పిటిషన్లపై విచారణను వేగంగా పూర్తి చేయాలి. ఇందుకోసం హైకోర్టుల్లో ప్రత్యేకంగా బెంచ్‌లను ఏర్పాటు చేయవచ్చు. వీటిలో ఒకరు లేదా ఎక్కువ సంఖ్యలో న్యాయమూర్తులను నియమించడంపై ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారు.
  ఎన్నికల్లో ‘నోటా (పై అభ్యర్థులెవరూ కాదు)’ను మరింతగా విస్తృతం చేసి, దానికి ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నికను రద్దు చేయాలన్న యోచన వద్దని న్యాయకమిషన్ సూచించింది. ఇక గెలిచినవారిని తిరిగి రీకాల్ (రైట్ టు రీకాల్) చేసే అవకాశాన్ని కల్పించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. దాని వల్ల అస్థిరత, గందరగోళం నెలకొంటుందని పేర్కొంది.
 
 ఎన్నికల్లో అభ్యర్థులెవరైనా కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం ఉండాలి. దీనివల్ల ఓటర్లకు ఇబ్బందులు, ప్రభుత్వానికి అనవసరపు వ్యయం, శ్రమ తగ్గుతాయి. ఈ మేరకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33(7)కు సవరణలు చేయాలి.
 ఎన్నికల్లో పోటీచేస్తున్నవారిలో డమ్మీ అభ్యర్థులే ఎక్కువ. ప్రధాన అభ్యర్థుల పేర్ల పోలికతో ఉండి ఓటర్లను తికమకపెట్టేందుకు స్వతంత్రులను పోటీ చేయిస్తున్నారు. కాబట్టి స్వతంత్రులకు పోటీ అవకాశం ఇవ్వరాదు. ఎవరైనా సీరియస్ అభ్యర్థులు ఉంటే వారు ఈసీ వద్ద ఓ పార్టీని రిజిస్టర్ చేసుకుని పోటీ చేయవచ్చు.
 
 ఫిరాయింపులకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రపతి, గవర్నర్‌లకు అప్పగించాలి. వారు ఈసీ సలహా మేరకు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి వాస్తవాధికారం ఎన్నికల సంఘానికే ఉన్నట్లవుతుంది.  ఇది సభల స్పీకర్ల, చైర్మన్ల నిష్పాక్షికత్వాన్ని
 పెంచుతుంది.
 నిర్బంధ ఓటింగ్ అమలు యోచన సరికాదు. ఇది అసాధ్యం, విపరీతమైన వ్యయం అవుతుంది. నిర్బంధ ఓటింగ్ అప్రజాస్వామికమనే విమర్శలు వస్తాయి. అంతేగాక ఈ విధానం వల్ల ప్రజల్లో అవగాహన, రాజకీయ చైతన్యం పెంపొందించడం అసాధ్యం.
 
 

మరిన్ని వార్తలు