సినిమాహాళ్లకు మరో నెల విరామం 

30 Jun, 2020 04:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

స్కూళ్లు, మెట్రో సర్వీసులు కూడా..

అన్‌లాక్‌–2 మార్గదర్శకాలను ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌–19 వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, జిమ్‌లు, మెట్రో రైలు సర్వీసుల పునఃప్రారంభాన్ని మరో నెలపాటు వాయిదా వేయాలని కేంద్రం నిర్ణయించింది. దశలవారీగా ఆంక్షలను సడలించేందుకు విధించిన అన్‌లాక్‌–1 గడువు మంగళవారంతో ముగియనుండగా ఈ మేరకు సోమవారం రాత్రి హోం శాఖ అన్‌లాక్‌–2 మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల నుంచి అందిన సమాచారం మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలిపింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో జూలై 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కఠినంగా అమలవుతుంది. కోవిడ్‌–19 వ్యాప్తికి అడ్డుకట్ట వేసేలా ఈ జోన్ల పరిధిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే నిర్ణయించాల్సి ఉంటుందని, ఈ విషయంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలో అత్యవసర సేవలకే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. 

► స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు జూలై 31వ తేదీ వరకు మూసివేసి ఉంటాయి. 
► సినిమాహాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశమందిరాలను కూడా తెరవరాదు. 
► సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మత సంబంధ ఉత్సవాలు, భారీ సమావేశాలపై నిషేధం కొనసాగుతుంది. పరిస్థితులను బట్టి వీటిని తెరిచే విషయమై తేదీలను తర్వాత ప్రభుత్వం ప్రకటిస్తుంది. 
► దేశీయ, అంతర్జాతీయ(వందేభారత్‌ మిషన్‌)విమానాలు, ఇప్పటికే పరిమిత సంఖ్యలో నడుస్తున్న ప్యాసింజర్‌ రైలు సర్వీసులను పరిస్థితులను బట్టి పెంచనుంది.

నేడు మోదీ ప్రసంగం
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు జాతి నుద్దేశించి ప్రసంగించనున్నారు. గల్వాన్‌ లోయలో జూన్‌ 15వ తేదీన జరిగిన భారీ ఘర్షణల అనంతరం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగించనుండటం గమనార్హం. 

మరిన్ని వార్తలు