‘నీట్‌’లో ఒకటే సెట్‌!

26 Jan, 2018 15:42 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)కు ఈ ఏడాది నుంచి సీబీఎస్‌ఈ ఒకే సెట్‌ ప్రశ్నపత్రం రూపొందించనుంది. సుప్రీంకోర్టుకు సీబీఎస్‌ఈ ఈ విషయం తెలిపింది. ఇప్పటివరకు హిందీ, ఇంగ్లిష్‌ సహా 10 భాషల్లో పరీక్ష రాసేందుకు విద్యార్థులకు అనుమతి ఉండేదని కోర్టుకు చెప్పింది. వేర్వేరు భాషల్లో ప్రశ్నపత్రం రూపొందిస్తే వాటిని దిద్దడం కష్టమని, పైగా ప్రశ్నలు వేర్వేరుగా ఉన్నప్పుడు విద్యార్థుల సామర్థ్యాన్ని ఎలా అంచనా వేయగలుగుతారని ఉన్నత న్యాయస్థానం గతంలో పేర్కొంది.

అన్ని పేపర్లలో కఠినత్వం ఒకే స్థాయిలో ఉంటుందని, అలాంటప్పుడు వేర్వేరు సెట్ల ప్రశ్న పత్రం రూపొందించడంలో తప్పు లేదన్న సీబీఎస్‌ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. అయితే కోర్టు సలహాలు విన్న సీబీఎస్‌ఈ.. ఈ ఏడాది నుంచి ఒకే సెట్‌ ప్రశ్నపత్రం రూపొందించి వాటిని ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేస్తామని వెల్లడించింది. ఒకే సెట్‌ ప్రశ్నపత్రం రూపొందించేలా సీబీఎస్‌ఈని ఆదేశించాలంటూ ‘సంకల్ప్‌ చారిటబుల్‌ ట్రస్టు’ పిటిషన్‌ దాఖలు చేసింది.

మరిన్ని వార్తలు