ఓఎన్‌జీసీ కీలక ప్రాజెక్ట్‌ పూర్తి చేసిన ఎంఇఐఎల్

6 Jan, 2020 15:01 IST|Sakshi

ఎంఇఐఎల్ మరో కీలక ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేసింది. చమురు రంగంలో వచ్చే మూడు దశాబ్దాల కాలానికి తగిన సామర్ధ్యంతో కూడిన నిర్వహణ వ్యవస్థను రూపొందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం అసోం రెన్యూవల్‌ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఈపీసీ విధానంలో  ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌ (ఎంఇఐఎల్‌) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అధునాతన పద్ధతిలో ఈ ప్రాజెక్టును పునర్‌ నిర్మించింది. భారత్‌లో ముడి చమురు, ఉత్పత్తి రవాణా వ్యవస్థల్లో ఓఎన్‌జీసీకి ఈ చెందిన ఆన్‌షోర్‌ వ్యవస్థ అతి భారీది.

మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన వ్యవస్థ ప్రస్తుత అవసరాలకు సరిపోకపోవడం, మరో వైపు వచ్చే 30 ఏళ్ల అవసరాలు దృష్టిలో పెట్టుకొని  అసోం ప్రాజెక్టు పునర్‌ నిర్మాణాన్ని ఓఎన్‌జీసీ చేపట్టింది. రూ.2400 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రతిష్టాత్మకమైన కాంట్రాక్టును ఈపీసీ పద్ధతిలో ఎంఇఐఎల్ దక్కించుకుంది. ప్రాజెక్టులో భాగంగా అసోంలోని నిర్మించిన  లఖ్వా గ్రూప్‌ గ్యాదరింగ్‌ స్టేషన్‌ (జీజీఎస్‌) ఇప్పటికే జాతికి అంకితమివ్వడం జరిగింది. తాజాగా ప్రాజెక్టు పనులన్నీ పూర్తికావడంతో డిసెంబర్ 26, 2019న ప్రయోగాత్మక పరిశీలన నిర్వహించడం ద్వారా దీన్ని వాణిజ్యపరంగా వినియోగంలోకి తీసుకువచ్చారు.

అసోం రెన్యూవల్ ప్రాజెక్టు ఆధునీకరణ ద్వారా ఓఎన్‌జీసీ ముడి చమురు, ఇంధన ప్రాసెసింగ్‌ సామర్ధ్యం భారీగా పెరుగుతుంది. రెన్యూవల్‌కు ముందు ఈ ప్రాజెక్టు ఉత్పత్తి సామర్ధ్యం ఏటా 1.4 ఎంటీపీఎ (మిలియన్‌ టన్స్ ఫర్ ఇయర్) అంటే 1.03 కోట్ల బ్యారెల్స్ (ఒక బ్యారెల్ అంటే ఇంచుమించు 159 లీటర్లు).  పునర్‌నిర్మాణం తర్వాత ఈ సామర్ధ్యం 1.83 కోట్ల బ్యారెల్స్‌కు పెరుగుతుంది. అంటే దాదాపు రెట్టింపు. ఆధునీకరణలో భాగంగా అత్యంత నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గతంలో ఉన్న 800 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను 560 కిలోమీటర్లకు ఎంఇఐఎల్‌ తగ్గించింది. గతంలోని విధానంలో 21 నిర్మాణాలు ఉండగా  ప్రస్తుతం అవి 9కి తగ్గాయి. వాటిని కూడా ఆధునిక ఇంటిగ్రేటెడ్‌ కేంద్రాలుగా మార్చి వ్యవస్థలోని సంక్లిష్టతలను తగ్గించి సరళతరం చేసింది ఎంఇఐఎల్‌.

ఒప్పందంలో భాగంగా రెన్యూవల్ ప్రాజెక్టులో కీలకమైన 5 గ్యాస్‌ సేకరణ కేంద్రాలను ఎంఇఐఎల్ నిర్మించింది. ఈ ఆధునిక వ్యవస్థ నిర్వహణకు తగినట్టుగా 2 నీటి శుద్ధికేంద్రాలు, 2 వాటర్ ఇంజెక్షన్ ప్లాంట్లు నిర్మించింది. సేకరించిన గ్యాసును కంప్రెస్ చేసే నిల్వ చేసేందుకు రెండు ప్లాంట్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ నవీకరణ ప్రాజెక్టులో భాగంగా ముడి చమురు నుంచి ఉత్పత్తయ్యే అన్నింటిని నిల్వ చేయడం, ప్రాసెస్ చేయడం, రవాణా వ్యవస్థ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యవస్థలో అత్యంత కీలకమైన గ్యాస్ కండిషనింగ్ కోసం గ్యాస్ డీహ్రైడేషన్ యూనిట్‌ నిర్మాణం కూడా జరిగింది. ఎకో ఫ్రెండ్లీగా వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఇక్కడ ఉత్పత్తయ్యే వ్యర్థాలన్నింటినీ నిర్మూలించేందుకు ప్రత్యేక వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది.

మరిన్ని వార్తలు