పొలంలోని ఉల్లి పంటనే ఎత్తుకెళ్లారు!

4 Dec, 2019 12:19 IST|Sakshi

భోపాల్‌: కొండెక్కెత్తున్న ఉల్లిపాయల ధరలు మనుషులను దొంగతనాలకు పాల్పడేలా చేస్తున్నాయి. బంగారాన్ని, ఉల్లిపాయల్ని పక్క పక్కన పెడితే బంగారాన్ని వదిలేసి ఉల్లియాల్ని చోరీ చేసి ఎత్తుకెళ్లే స్థాయికి ఉల్లి ధరలు చేరుకున్నాయి. సాధారణంగా ఇంట్లో ఉన్న ఉల్లిపాయలను దొంగలించడం గురించి మనం వింటుంటాం.. కానీ ఏకంగా పొలంలో పంటల మీద ఉన్న ఉల్లిపాయల్ని ఎత్తుకెళ్లిన ఘటన మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో చోటు చేసుకుంది. తమ పంట మరికొద్ది రోజుల్లో చేతికి వస్తుందన్న ఆనందంలో ఉన్న రైతుకు.. ఉల్లి పంట ఆయన కళ్లల్లో కన్నీటినే నింపింది.

వివరాల్లోకెళ్తే.. రిచా గ్రామంలోని జితేంద్ర కుమార్ అనే రైతు పొలంలో చోరీ జరిగింది. ఈ చోరీలో సుమారు రూ. 30 వేలకు పైగా విలువ చేసే ఆరు క్వింటాళ్ల ఉల్లి పంటను దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఆ  రైతు నారాయణగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంట పూర్తిగా చేతికి రాకముందే ఉల్లిని ఎత్తుకెళ్లడం స్థానికంగా సంచలనం రేపింది. దొంగలను వెంటనే పట్టుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు. కాగా ఉల్లి దొరకడమే బంగారం అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. దీంతో మార్కెట్లో ఉన్నవాటికే కాదు.. పంట చేలలో ఉన్న వాటిని కూడా వదలడం లేదు. జితేంద్ర కుమార్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. కిలో ఉల్లిపాయలు రూ.100కు చేరుతున్న తరుణంలోనే ఇలా జరిగింటుదన్నారు. అయితే ఉల్లి పంటను దోచుకుపోయారని రైతు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు