అధికార పార్టీది పగటి కల

29 Sep, 2017 12:08 IST|Sakshi

బిజేపూర్‌లో బీజేపీ గెలుపు తథ్యం

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

భువనేశ్వర్‌(ఒడిశా): పశ్చిమ ఒడిశాలోని బర్‌గడ్‌ జిల్లా బిజేపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం వైపు అందరి దృష్టి మళ్లింది. ఈ నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం తథ్యమని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గురువారం ప్రకటించారు. బీజేడీ దీర్ఘపాలనతో బిజేపూర్‌ నియోజకవర్గానికి జరిగిన నష్టం, వెనుకబాటు దృష్ట్యా సానుభూతి ముసుగులో బిజూ జనతా దళ్‌కు ఓట్లు పడి విజయం సాధిస్తారనేది పగటి కల అని మంత్రి ధర్మేంద్ర వ్యాఖ్యానించారు. బిజేపూర్‌ ఓటర్లు సానుభూతిపట్ల మక్కువ కనబరచరు. దీర్ఘకాలంగా ఈ నియోజకవర్గం ఎటువంటి పురోగతికీ నోచుకోలేదు. రాష్ట్రంలో బిజూ జనతా దళ్‌ సర్కారు దీర్ఘపాలనపట్ల బిజేపూర్‌ ఓటర్ల వైఖరి భిన్నంగా ఉంది.  ఇక్కడి ఓటర్లు సానుభూతి వలలో చిక్కుకోకుండా విచక్షణతో మార్పు కోసం ఓటు వేయడం తథ్యం. గత పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి ప్రభంజనం కనిపిం చింది. ఇదే పంథాలో బిజేపూర్‌లో కూడా ఊహాతీతమైన పరిణామాలు తలెత్తి భారతీయ జనతా పార్టీకి అనుకూలిస్తాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గట్టి ధీమా వ్యక్తం చేశారు.

త్వరలోనే అభ్యర్థి ప్రకటన
దివంగత నాయకుడు సుబొలొ సాహు అకాల మరణంతో రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో భారీ లోటు ఏర్పడింది. ఈ లోటు భర్తీపట్ల బిజేపూర్‌ నియోజకవర్గం ఓటర్లు ఆచి తూచి ఓటు వేస్తారు. అందుకు అన్ని విధాలా అనుకూలమై న వ్యూహంతో తమ పార్టీ ప్రజల ముందు ప్రత్యక్షమవుతుంది. ప్రజల మనోగతాలకు అనుకూలమైన అభ్యర్థిని బరిలోకి దింపి విజయం సాధి స్తుం దని చెప్పారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి కార్యకర్తలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు.   త్వరలో పార్టీ తరఫు అభ్యర్థిని ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు.  పం చాయతీ ఎన్నికల్లో విజయం స్ఫూర్తితో బిజేపూర్‌ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని  ఆ పార్టీ రాష్ట్ర శాఖ శిబిరం నుంచి ఊహాగానాలు విస్తృతంగా ప్రసారంలో ఉన్నాయి. 

ఆన్‌లైన్‌లో పెట్రోల్, డీజిల్‌ 
భువనేశ్వర్‌: సాంకేతిక సమాచారం, టెలికాం రంగాల అభివృద్ధి నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌ పంపిణీ వ్యవస్థ సంస్కరణకు ఆ విభాగం యోచిస్తోంది. అతి త్వరలో పెట్రోల్, డీజిల్‌ను  ఆన్‌లైన్‌లో పంపిణీ చేయనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన ట్విటర్‌ ఖాతాలో ప్రసారం చేశారు. దైనందిన జీవితంలో డిజిటలైజేషన్‌కు తమ ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తుందని కేంద్ర సాంకేతిక సమాచార శాఖ తరచూ ప్రసారం చేస్తోంది. ఈ నేపథ్యంలో పెట్రోలియం శాఖ ఆన్‌లైన్‌ పంపిణీ యోచన త్వరలో కార్యాచరణకు నోచుకుంటుందనే నమ్మకం వినియోగదారుల్లో  కలుగుతోంది.

క్లిక్‌ చేస్తే ఇంటికే పెట్రోల్‌
పెట్రోల్‌ బంకు వరకు వెళ్లి బారులు తీరి వేచి ఉండాల్సిన పరిస్థితులకు త్వరలో తెరపడనుంది. క్లిక్‌ చేస్తే ఇంటి ముంగిట పెట్రోల్, డీజిల్‌ ప్రత్యక్షమవుతాయనే ఉత్సాహం వినియోగదారుల్లో ఉరకలేస్తోంది. దేశంలో గత ఏడాది నవంబర్‌లో పెద్ద నోట్లు రూ.500, రూ.1,000 రద్దును పురస్కరించుకుని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఆన్‌లైన్‌లో పెట్రో ఉత్పాదనల పంపిణీని ప్రతిపాదించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు పెట్రో ఉత్పాదనల్ని ఆన్‌లైన్‌లో పంపిణీ చేసేందుకు యోచిస్తున్నట్లు ఆ విభాగం ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన పార్లమెంట్‌ సలహా మండలి సమావేశంలో పేర్కొంది.    

మరిన్ని వార్తలు