పురుషులు 50శాతం, స్త్రీలు 39శాతం మాత్రమే

10 Mar, 2016 18:39 IST|Sakshi

భారత కార్మికుల్లో పని విషయంలో మహిళలు పురుషులతో పోలిస్తే కాస్త వెనుకబడే ఉన్నారంటున్నాయి తాజా పరిశోధనలు. పనిచేసే చోట ఏభై శాతం మంది పురుషులతో పోలిస్తే కేవలం 39 శాతం మహిళలు మాత్రమే పూర్తిగా విధుల్లో నిమగ్నమౌతున్నారని సర్వేలు చెప్తున్నాయి.

డేల్ కార్నెగీ ట్రైనింగ్ ఇండియా విడుదల చేసిన లెక్కల ప్రకారం భారత పురుషులు 50 శాతం మంది విధుల్లో కొనసాగుతుంటే కేవలం  39 శాతం మంది మహిళలు మాత్రమే విధుల్లో కొనసాగుతున్నారని తేల్చి చెప్పింది. అయితే ఇక్కడ కూడా నియామకాలతోపాటు ప్రతి విషయంలోనూ లింగ వివక్ష లక్ష్యంగా ఉంటోందని, ప్రమోషన్ల దగ్గర నుంచీ మహిళలకు కనిపించని అడ్డు గోడలు ప్రతి స్థాయిలోనూ ఎదురౌతూనే ఉన్నాయని సర్వేలు చెప్తున్నాయి. ఇటువంటి కారణాలతోనే విధులను మధ్యలోనే వదిలేసి వెళ్ళేవారి శాతం ఎక్కువగా ఉంటోందని డీసీటీఐ ఛైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ పల్లవి ఝా తెలిపారు.

భారత మహిళలు తరచుగా  కార్యాలయాల్లోని పురుష సహచరులతోపాటు... చాలా సందర్భాల్లో పై అధికారుల వివక్షకు గురౌతున్నారని డీసీటీఐ లెక్కలు చెప్తున్నాయి. అయితే ఉత్పాదకత విషయంలో మహిళలు వెనుకబడుతున్నారన్న భ్రమలో కంపెనీలు ఉండటమే కాక,  అంచనాలకు మించి వారినుంచి ఆశించడం ఇందుకు కారణమౌతోందని, ముఖ్యంగా సంస్థలు మహిళల నుంచి ఎంత పని తీసుకోగలం, వారి అభివృద్ధికి ఎటువంటి ప్రోత్సాహం అందించగలం అన్నదానిపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండటం అవసరమని ఝా తెలిపారు.

వివిధ హోదాల్లోని మహిళలను పరిశీలిస్తే... సీ సూట్ (సీనియర్ ఎగ్జిక్యూటివ్) స్థాయిలో మహిళలు అత్యధికంగా 63 శాతం వరకు ఉంటున్నారని, సంస్థాగత పరిపాలనా స్థాయిలో 42శాతం మంది ఉండగా... న్యాయవాదులు, ఇంజనీర్లు వంటి ఇతర ప్రోఫెషనల్ ఉద్యోగాల్లో కేవలం 18 శాతం మంది మాత్రమే విధుల్లో కొనసాగుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే బీపీవోల్లో మాత్రం మహిళా ఉద్యోగుల శాతమే ఎక్కువగా ఉంటోందని, వారిలోని ప్రతిభను ఖాతాదారులను ఆకట్టుకునేందుకు ఆయా కంపెనీలు వినియోగించుకుంటున్నాయని డీసీటీఐ అధ్యయనాల్లో నిర్థారించారు.

>
మరిన్ని వార్తలు