పన్ను చెల్లింపులు 4 శాతమే!

30 Apr, 2016 14:39 IST|Sakshi

న్యూ ఢిల్లీః పన్ను ఎగవేతదారులు రోజురోజుకూ పెరిగిపోతున్నారన్న విషయం ప్రభుత్వ తాజా నివేదికలను బట్టి తెలుస్తోంది. దేశ జనాభా వంద కోట్లకు పైగా ఉన్నా... వారిలో ఆదాయ పన్ను చెల్లించేవారి సంఖ్య కేవలం మూడున్నర కోట్లు కూడ మించడం లేదన్న విషయం ఇటీవలి ప్రభుత్వ గణాంకాలు వివరిస్తున్నాయి. పెద్దమొత్తంలో సంపాదించే వారు కూడ ప్రభుత్వానికి పన్ను చెల్లించకపోవడంతో పన్ను చెల్లింపులు ఏమాత్రం పెరగడం లేనట్లు లెక్కలు చెప్తున్నాయి.

నెలసరి ఆదాయం 21 వేల రూపాయలు దాటితే ఆ వ్యక్తి ఆదాయపు పన్ను చెల్లింపు పరిథిలోకి వస్తాడు. దేశంలో సంవత్సరానికి కోటి రూపాయలు మించి ఆదాయం ఉన్నవారు అధికంగానే ఉన్నా చెల్లింపులు మాత్రం నాలుగు శాతానికి మించడం లేదని ప్రభుత్వ లెక్కలు సూచిస్తున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో టాక్స్ చెల్లింపులు ధాఖలు చేసిన భారతీయులు కేవలం 4 శాతమే ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. వార్షిక ఆదాయం  పది లక్షలకు మించి ఉన్నవారు అధికంగానే ఉన్నా... పన్ను చెల్లింపుల విషయంలో మాత్రం పది లక్షల మంది కూడ కనిపించడం లేనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.  

2012-13 ఆర్థిక సంవత్సరంలో సంవత్సరానికి కోటి రూపాయల ఆదాయం మించి ఉన్నవారిలో... పన్ను చెల్లింపులు దాఖలు చేసినవారు 20,000 కు లోపుగానే ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. కేవలం  3.1 కోట్ల చెల్లింపులు మాత్రమే ఆ సంవత్సరంలో దాఖలయ్యాయి. 2000-01  నుంచి 2014-15 వరకు విశ్లేషణాత్మక గణాంకాలను ఇటీవల ఆదాయ పన్ను శాఖ విడుదల చేసింది. అయితే ఈ గణాంకాల విడుదల ఓ మైలు రాయిగా చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నారు. పన్ను చెల్లింపులపై పారదర్శకతను తెలియజేయడానికి ఇదో మంచి విధానం అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు