తాజ్‌ పర్యాటకులపై ఆంక్షలు

3 Jan, 2018 09:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తాజ్‌మహల్‌ను సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్యపై ప్రభుత్వం పరిమితి విధించింది. రోజుకు 40 వేల మంది భారతీయ పర్యాటకులు మాత్రమే ఇకపై తాజ్‌ను వీక్షించనున్నారు. అయితే విదేశీ పర్యాటకుల సంఖ్యపై పరిమితి విధించలేదు. కేంద్ర పర్యాటక శాఖ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఈనెల 20 నుంచి అమల్లోకి రానుంది. 

తాజ్‌మహల్‌ పరిరక్షణ గురించి పారా మిలటరీ, ఏఎస్‌ఐ, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర పర్యాటక శాఖ చర్చలు జరిపింది. చర్చల అనంతరం భారతీయ సందర్శకుల సంఖ్యపై పరిమితి విధించాలని పర్యాటక శాఖ నిర్ణయం తీసుకుంది. తాజ్‌ను వీక్షించే టూరిస్టుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరిగిపోతోంది. దీంతో ఈ ప్రపంచ వారసత్వ కట్టడాన్ని సంరక్షించేందుకు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు, ఇతర రక్షణ చర్యలు తీసుకునేందుకు ఇబ్బందులు ఎదరవుతున్నట్లు అధికారులు తెలిపారు. 

ఇదిలావుండగా.. ఎంట్రెన్స్‌ టిక్కెట్‌ ధరపైనా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా నిర్ణయం ప్రకారం 15 ఏళ్లలోపు చిన్నారులకు ప్రవేశం ఉచితం. అయితే ప్రతి ఒక్కరికీ టిక్కెట్‌ మాత్రం జారీ చేస్తారు. ఇలా రోజు 40 వేల టిక్కెట్లు మాత్రమే జారీ చేస్తారు. ముంతాజ్‌ సమాధిని దర్శించేందుకు మాత్రం ప్రత్యేకంగా రూ.100 టిక్కెట్‌ తీసుకోవాలి. 

మరిన్ని వార్తలు