మందిర్‌ ఒక్కటే మార్గం..

24 Nov, 2017 18:38 IST|Sakshi

సాక్షి,ఉడిపి(కర్ణాటక): అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణం చేపట్టాలని వేరే నిర్మాణాలు అనుమతించమని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. దేశవ్యాప్తంగా హిందూ సన్యాసులు, మఠాల అధిపతులు, వీహెచ్‌పీ నేతలు హాజరైన ధర్మ సంసద్‌లో మోహన్‌ భగవత్‌ మాట్లాడారు.అయోధ్యలో రామ మందిరం నిర్మించాలనడంలో ఎలాంటి సందిగ్ధత లేదని స్పష్టం చేశారు.‘మందిరాన్ని తప్పక నిర్మిస్తాం..ఇది జనాకర్షక నిర్ణయం కాదు..తమ విశ్వాసానికి సంబంధించిన అంశ’మన్నారు.

ఈ అంశం కోర్టులో ఉన్నదంటూనే ఏళ్ల తరబడి చేసిన ప్రయత్నాలు, త్యాగం ఫలించే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. గతంలో రామాలయం ఉన్న మాదిరిగానే ఆలయం నిర్మించడం జరుగుతుందని, గత 25 ఏళ్లుగా రామజన్మభూమి ఉద్యమంలో పాలుపంచుకున్న వారి మార్గదర్శకాలతో మందిర నిర్మాణం జరుగుతుందని చెప్పారు.

మందిర నిర్మాణానికి ముందు ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు.రామ మందిర నిర్మాణం, మత మార్పిడుల నిరోధం, గో సంరక్షణ వంటి అంశాలపై ధర్మసంసద్‌లో చర్చిస్తామని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు